ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. ముందుగా బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ ఎలా చేయాలనేదానిపై ఓ అవగాహన వస్తుందని చెప్పాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. ముందుగా బౌలింగ్ చేస్తే.. వికెట్ ఎలా ఉందనేదానిపై అవగాహన వస్తుంది. ఇక్కడ డ్యూ ప్రభావం కూడా బాగానే ఉంటుంది. సానుకూలంగా ఉండటం ముఖ్యం. ఈ ఫార్మాట్‌లో ఫియర్‌లెస్‌గా ఆడటంతో పాటు మంచి ఇంటెంట్‌తో ఆడటం ముఖ్యం. మేం చాలా మంచి క్రికెట్ ఆడాము. టీ20 అంటేనే ప్రతీ రోజు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే. మేం ఈ మ్యాచ్ కోసం అన్ని విధాల సిద్దమయ్యాం.

గత మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నాం. మేం ప్రస్తుతం గురించే ఆలోచించాలనుకుంటున్నాం. నేను స్టార్ ఆటగాళ్లుగా చూడను. అందరూ సమష్టిగా రాణించాలనే కోరుకుంటాను. అనారోగ్యంతో సునీల్ నరైన్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. అతని స్థానంలో మోయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు.'అని అజింక్యా రహానే తెలిపాడు.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోందని ఆ జట్టు తాత్కలిక కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. ఫజలక్ ఫరూకీ స్థానంలో వానిందు హసరంగా తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ వంటి జట్టుకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని తెలిపాడు. '17 ఏళ్ల వయసులో ఈ జట్టుతో నా ప్రయాణం ప్రారంభించాను. మేనేజ్‌మెంట్ నాపై నమ్మకం ఉంచింది. ఇది నేను మాటల్లో చెప్పలేను. గత మ్యాచ్‌లో ఓడినా చాలా సానుకూలాంశాలు లభించాయి. మిడిలార్డర్ అద్భుతంగా ఆడింది. బంతితోనూ మెరుగైన ప్రదర్శన చేశాం.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
కేకేఆర్: క్వింటన్ డి కాక్(కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ.
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వానిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.