
19 బంతుల్లో 8 రన్సే..
ధనాధన్ సిక్సర్లు పడుతున్న షార్జా మైదానంలో స్మిత్ వికెట్ తర్వాత క్రీజులోకి వచ్చిన తెవాటియా.. బ్యాటింగ్ చేయడానికి తెగ ఇబ్బంది పడ్డాడు. ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేశాడు. ఒకానొక దశలో బంతిని బ్యాట్‌కు తగిలించేందుకు కూడా ఈ ఆల్‌రౌండర్ కష్టపడుతుండటంతో క్రీజులో ఉన్న సంజూ శాంసన్ అతనికి స్ట్రైకింగ్ ఇవ్వకుండా ఆడాడు. సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా తీయకుండా భారీ షాట్లను ఆడాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఘోర తప్పిదం చేసిందని యావత్ క్రికెట్ ప్రపంచం భావించింది. రాబిన్ ఊతప్పను కాకుండా రాహుల్ తేవాటియా పంపించి మూల్యం చెల్లించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు.. ఇలా అన్ని భాషల కామెంటేటర్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఓటమికి అతనే కారణం..
తెలుగు కామెంట్రీ చెబుతున్న ఎమ్మెస్కే ప్రసాద్ కూడా తెవాటియా బ్యాటింగ్ చేయడం తాను ఎక్కడా చూడలేదని, వినలేదని చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ బ్లండర్ మిస్టెక్ చేసిందని, అతను బంతులను వృథా చేయడం వల్ల సంజూశాంసన్‌పై ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో మహ్మద్ షమీ వేసిన బౌన్సర్‌ను అప్పర్ కట్ ఆడే ప్రయత్నంలో సంజూ శాంసన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ గెలుపు ఖాయమని అంతా భావించారు. ఇక శాంసన్ ఔట్‌కు, మ్యాచ్ చేజారడానికి తెవాటియానే కారణమని ఎమ్మెస్కే వ్యాఖ్యానించాడు.

ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు
కానీ షెల్డన్ కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో తెవాటియా అనూహ్యంగా చెలరేగిపోయాడు. వరుసగా నాలుగు సిక్స్‌లు బాది మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు. ఐదో బంతిని డాట్ చేసిన అతను ఆరో బంతికి మరో భారీ సిక్సర్ కొట్టాడు. అనంతరం షమీ బౌలింగ్‌లో మరో సిక్సర్ కొట్టి ఔటయ్యాడు. బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్, లాంగ్ ఆఫ్, మిడ్ వికెట్ మీదుగా రాహుల్ తెవాటియా అద్భుతంగా సిక్సులు బాదాడు. మొదటి 19 బంతుల్లో 8 రన్స్ చేసిన తెవాటియా.. చివరి 12 బంతుల్లో 45 రన్స్ చేసి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అతనికి తోడుగా జోఫ్రా ఆర్చర్ రెండు భారీ సిక్సర్లు కొట్టగా.. టామ్ కరన్ ఫోర్ కొట్టి విజయాన్నందించాడు.

ఐయామ్ వెరీ సారీ..
మ్యాచ్ అనంతరం బైజూస్ క్రికెట్ లైవ్‌లో హోస్ట్ నందుతో మాట్లాడిన ఎమ్మెస్కే తన తప్పిదానికి క్షమాపణలు కోరాడు. ‘తెవాటియా గురించి తెలుసుకోకుండా అనవసర వ్యాఖ్యలు చేశాను. నా మాటలను వెనక్కు తీసుకుంటున్నా. అదే విధంగా బేషరతుగా క్షమాపణలు కోరుతున్నా. రాహుల్ తెవాటియా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారీ సిక్సర్లతో జట్టుకు విజయాన్నందించాడు. బహుషా అతనిలోని ఈ సామర్థ్యాన్ని గుర్తించే టీమ్‌మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందనుకుంటా.'అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












