ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జైపూర్ వేదికగా ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో నిర్ణీత సమయానికి అంపైర్లు టాస్ వేయలేకపోయారు. ప్రస్తుతం వర్షం తగ్గగా.. ఆట కోసం గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్దం చేస్తున్నారు. మైదానాన్ని పరిశీలించి అంపైర్లు టాస్ వేయనున్నారు.
అయితే మ్యాచ్ పూర్తయ్యేలోపు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఫోర్‌కాస్ట్ కండీషన్స్ నేపథ్యంలో టాస్ గెలవడం ఇరు జట్లకు కీలకంగా మారింది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఓటమెరుగని జట్టుగా పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఆ జట్టులో సంజూ శాంసన్, రియాన్ పరాగ్, జోస్ బట్లర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.
ఇరు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు తలపడగా.. నాలుగు మ్యాచ్‌ల్లో గుజరాత్ గెలవగా.. రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాచ్ గెలిచింది.