ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రషీద్ ఖాన్ సంచలన బ్యాటింగ్‌తో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. కుల్దీప్ సేన్ 19వ ఓవర్‌లో 20 పరుగులు ఇవ్వడం రాజస్థాన్ రాయల్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76 ), సంజూ శాంసన్(38 బంతుల్లో7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసారు.

శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72) హాఫ్ సెంచరీతో రాణించగా.. సాయి సుదర్శన్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) పర్వాలేదనిపించాడు. చివర్లో రాహుల్ తెవాటియా(20 నాటౌట్), రషీద్ ఖాన్(24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఇదే తొలి పరాజయం.
శుభారంభం..
197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ శుభారంభాన్ని అందించారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించిన అనంతరం కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ వికెట్ల ముందు దొరికపోయాడు.
ఆ వెంటనే తన మరుసటి ఓవర్‌లో మాథ్యూ వేడ్(4), అభినవ్ మనోహర్(1)లను కుల్దీప్ సేన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ సాయంతో గిల్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయ్ శంకర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన చాహల్.. తన మరుసటి ఓవర్‌లో ధాటిగా ఆడిన గిల్‌ను స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.
కొంపముంచిన కుల్దీప్ సేన్..
ఈ పరిస్థితుల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షారూఖ్ ఖాన్(14) ఫోర్, సిక్సర్‌తో ఆశలు రేకెత్తించినా.. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ విజయానికి చివరి 12 బంతుల్లో 35 పరుగులు అవసరమయ్యాయి. కుల్దీప్ సేన్ వేసిన 19వ ఓవర్‌లో రషీద్ ఖాన్ ఒకటి, తెవాటియా రెండు బౌండరీలు బాదడంతో 20 పరుగులు వచ్చాయి.
దాంతో గుజరాత్ విజయానికి చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమవ్వగా.. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ తొలి నాలుగు బంతుల్లో 11 పరుగులు చేయగా.. ఐదో బంతికి తెవాటియా మూడు పరుగులు తీసే క్రమంలో రనౌటయ్యాడు. చివరి బంతికి రషీద్ ఖాన్ బౌండరీ బాది గుజరాత్ టైటాన్స్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.