
ముంబై: రవిచంద్రన్ అశ్విన్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), దేవదత్ పడిక్కల్(30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చేతన్ సకారియా(2/23), అన్రిచ్ నోర్జ్(2/39), మిచెల్ మార్ష్ (2/25) రెండేసి వికెట్లు తీయడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఇద్దరు మినహా రాజస్థాన్ బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్(7)ను సకారియా ఔట్ చేయగా.. యశస్వి జైస్వాల్‌ను మిచెల్ మార్ష్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్, పడిక్కల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో ముందుగా అశ్విన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అతన్ని మార్ష్ ఔట్ చేశాడు. సంజూ శాంసన్(6), రియాన్ పరాగ్(9)లు కూడా ధాటిగా ఆడే క్రమంలో విఫలమయ్యారు. హాఫ్ సెంచరీకి చేరువైన పడిక్కల్‌ను అన్రిచ్ నోర్జ్ ఔట్ చేశాడు. దాంతో రాజస్థాన్ 160 పరుగులకే పరిమితమైంది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. శ్రీకర్ భరత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.