
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లి క్యాపిటల్స్ అద్భుత విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరార్ చేసుకోలేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేసింది. రవిచంద్రన్ అశ్విన్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), దేవదత్ పడిక్కల్(30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) మినహా అంతా విఫలమయ్యారు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చేతన్ సకారియా(2/23), అన్రిచ్ నోర్జ్(2/39), మిచెల్ మార్ష్ (2/25) రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం ఢిల్లీ 18.1 ఓవర్‌లో 2 వికెట్లకు 161 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(62 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 89), డేవిడ్ వార్నర్(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ తలో వికెట్ తీసారు.
161 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే తెలుగు తేజం శ్రీకర్ భరత్(0) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో ఢిల్లీ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్‌తో మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆరంభంలో ఈ జోడీ నిదానంగా ఆడింది. దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం జోరు పెంచిన ఈ జోడీ స్కోర్ బోర్డును వేగంగా పరుగెత్తించింది. కుల్దీప్ సేన్ వేసిన ఏడో ఓవర్‌లో మార్ష్ రెండు సిక్స్‌లు బాది జోరు కనబర్చాడు. చాహల్ బౌలింగ్‌లో సిక్స్ బాది వార్నర్ కూడా లయ అందుకున్నాడు.
చాహల్ వేసిన 11వ ఓవర్ రెండో బంతిని సిక్సర్‌గా మలిచిన మార్ష్.. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే చాహల్ వేసిన 18వ ఓవర్‌లో మిచెల్ మార్ష్ భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన పంత్ రెండు భారీ సిక్స్‌లు బాదాడు. కుల్దీప్ సేన్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి ట్రిపుల్ తీసి వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆ జట్టు విజయం లాంఛనమైంది.