ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు తమ జోరును కొనసాగిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ కట్టడిగా బౌలింగ్ చేసి ఆ జట్టును తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) ఒంటరి పోరాటంతో చేయడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది.
నితీష్ రాణాతో పాటు రియాన్ పరాగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/38), నూర్ అహ్మద్(2/28), మతీష పతీరణ(2/23) రెండేసి వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

చెలరేగిన రాణా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్‌లో యశస్వి జైస్వాల్(4) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ రాణా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్‌తో కలిసి చెలరేగాడు. వచ్చి రావడంతోనే బౌండరీలతో చెన్నై బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. జేమీ ఓవర్ట్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ బాదిన రాణా.. అతని మరుసటి ఓవర్‌లో రెండు ఫోర్లతో పాటు మరో సిక్సర్ కొట్టాడు.
అశ్విన్ వేసిన ఐదో ఓవర్‌లో వరుసగా 6, 6, 4 బాదిన రాణా.. ఖలీల్ అహ్మద్ వేసిన మరుసటి ఓవర్‌లో బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా బౌండరీ బాది 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతినే భారీ సిక్సర్‌గా తరలించడంతో పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది.
దెబ్బతీసిన నూర్ అహ్మద్..
పవర్ ప్లే అనంతరం చెన్నై బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయగా.. రాజస్థాన్ పరుగుల వేగం తగ్గింది. నూర్ అహ్మద్.. సంజూ శాంసన్(20) ఔట్ చేయగా.. రియాన్ పరాగ్‌తో కలిసి రాణా దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అశ్విన్ బౌలింగ్‌లో 6, 4 బాదిన రాణా.. ధోనీ మయాజాలంతో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్(3), వానిందు హసరంగ(4) తీవ్రంగా నిరాశపర్చగా.. షిమ్రాన్ హెట్‌మైర్ సాయంతో రియాన్ పరాగ్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని పతీరణ క్లీన్ బౌల్డ్ చేసి రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేసాడు. జోఫ్రా ఆర్చర్, ఇంపాక్ట్ ప్లేయర్ కుమార్ కార్తీకేయ(1)తో హెట్‌మైర్(19) తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో రాజస్థాన్ రాయల్స్ 182 పరుగులకే పరిమితమైంది.