కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిలపడిన రాజస్థాన్ రాయల్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి మూడు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాలి.
ఈ క్రమంలోనే కేకేఆర్‌తో పోరు రాజస్థాన్‌కు కీలకంగా మారింది. మరోవైపు 6వ స్థానంలో కొనసాగుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కూడా ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్ చేజేతులా చేజార్చుకుంది. ఆఖరి ఓవర్‌లో సందీప్ శర్మ వేసిన నోబాల్.. రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది. ఈ క్రమంలోనే కేకేఆర్‌తో రాజస్థాన్ పకడ్బందీ ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. అతని రాకతో ఒబెడ్ మెక్‌కాయ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
జాసన్ హోల్డర్‌ను తీసుకోవాలనుకుంటే జోరూట్‌ను పక్కనపెట్టనున్నారు. బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంచాలనుకుంటే మాత్రం జోరూట్ జట్టులో కొనసాగుతాడు. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే జోరూట్ స్థానంలో ఒబెడ్ మెక్‌కాయ్, జాసన్ హోల్డర్‌లలో ఒకరు జట్టులోకి రానున్నారు.
ఇవి మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు.
ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. సంజూ శాంసన్ కూడా గత మ్యాచ్‌తో మంచి టచ్‌లోకి వచ్చాడు. షిమ్రాన్ హెట్‌మైర్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ట్రెంట్ బౌల్ట్ రీఎంట్రీతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టం కానుంది. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
గత మ్యాచ్‌లో సందీప్ శర్మ విఫలమైనా.. ఈ సీజన్‌లో అతను మెరుగైన ప్రదర్శనే చేశాడు. ధృవ్ జురేల్, కుల్దీప్ యాదవ్‌లను ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకోనున్నారు.
కేకేఆర్‌తో రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు(అంచనా)
యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, జోరూట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మైర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్: కుల్దీప్ యాదవ్