
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశాంతతకు మారు పేరని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా భావోద్వేగాలను ప్రదర్శించడని.. మిస్టర్ కూల్ అని అభిమానులు ప్రశంసిస్తుంటారు. అయితే ధోనీ కూడా ఇతరుల్లానే సహనం కోల్పోయిన సందర్భాలున్నాయని, కాకపోతే అతను తెలివిగా వ్యవహరిస్తాడని గతంలో చాలా మంది ఆటగాళ్లు చెప్పారు. తాజాగా భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కూడా ధోనీ గుస్సా అయిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. అది కూడా తనకు అత్యంత సన్నిహితంగా ఉండే సురేశ్ రైనాపై కోపాద్రిక్తుడయ్యాడని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు. ధోనీ, రైనా రిటైర్మెంట్‌పై ఓ క్రికెట్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.
'శ్రీలంక పర్యటనలో ఓ మ్యాచ్ సందర్భంగా రైనాపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రైనాకు వెనక్కు వెళ్లమని ధోనీ వార్నింగ్ ఇచ్చాడు. మహీ మాటలు పట్టించుకోని రైనా ముందుకు వచ్చాడు. కొన్ని డెలివరీస్ తర్వాత రైనా బంతిని మిస్ ఫీల్డ్ చేయడంతో ధోనీ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. చెప్పినట్లు చేయమని రైనాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ధోనీ తన ఆగ్రహాన్ని మాటల్లో.. చేతల్లో.. చూపించనప్పటికీ అప్పడప్పుడు కోపాద్రిక్తుడయ్యేవాడు'అని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు.
ధోనీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆర్పీ సింగ్.. అతన్ని తొలి సారి దేవధర్ ట్రోఫీ సందర్భంగా కలిసానన్నాడు. 'దేశవాళీ క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీ సందర్బంగా తొలిసారి ధోనీని కలిసాను. ఈస్ట్ జోన్‌లో లేనప్పటికి అతను అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత బెంగళూరు క్యాంప్‌లో కలుసుకున్నాం. కాకపోతే అప్పటికే ధోనీ గురించి నాకు తెలుసు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లో అనధికారికంగా చాలా టోర్నీలు జరుగుతాయి. గ్వాలియర్‌లో ధోనీని ఫస్ట్ టైమ్ కలిసే నాటికే అతనికి మంచి పేరుంది. అతను చాలా రిజర్వ్‌డ్ పర్సన్. అతని చుట్టు ఉన్న వ్యక్తులతోనే తప్పా మిగతా వారితో పెద్దగా మాట్లాడడు. అతి తక్కువ మందితో ఉండటానికి ఇష్టపడుతాడు. ఇండోర్స్ ఎక్కువ గడపడం అతనిపై ప్రభావం చూపింది. అతని ప్రపంచంలోనే వీడియో గేమ్స్ ఆడుకుంటూ సంతోషంగా ఉంటాడు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటారనే విషయాన్ని కూడా నమ్మడు.'అని ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు.
భారత 74 స్వాతంత్ర్య దినోత్సవం నాడే ధోనీ ఓ ఇన్‌స్టా పోస్ట్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 'కెరీర్ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో షేర్ చేశాడు.
ఆ వెంటనే రైనా కూడా 'నీతో కలసి ఆడడం కంటే ఏదీ గొప్ప కాదు. నీతో కలసి ఆడినందుకు నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతున్నది. ఈ జర్నీలో నీతో పాటే నడవాలని అనుకుంటున్నా. భారతావనికి ధన్యవాదాలు.. జైహింద్'అని రిటైర్మెంట్ ప్రకటించాడు.