ఐపీఎల్ 2026 మినీ వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తెలివిగా వ్యవహరించింది. మంగళవారం అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ ఆక్షన్‌లో కేవలం రూ.16.4 కోట్లు పర్స్‌మనీతోనే బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ డబ్బుతోనే 8 మంది ఆటగాళ్లను తీసుకుంది. బ్యాకప్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఆర్‌సీబీ.. ఆ పని పూర్తి చేసింది. అంతేకాకుండా ఇండియన్ ఆల్‌రౌండర్ లోటును భర్తీ చేసింది. అందుకోసం వెంకటేశ్ అయ్యర్‌పై రూ.7 కోట్లను కుమ్మరించింది.
గతేడాది మెగా సీజన్‌లోనూ ఈ ప్లేయర్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆర్‌సీబీ రూ.23.75 కోట్ల వద్ద చేతులెత్తేసింది. కేకేఆర్ ఆ భారీ ధరకు కొనుగోలు చేయగా.. అతను తీవ్రంగా నిరాశపర్చాడు. దాంతో వేలంలోకి వదిలేసిన ఆ జట్టు వెంకటేశ్ అయ్యర్ తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది. కానీ ఈ సారి ఆర్‌సీబీ వెనకడుగు వేయకుండా రూ.7 కోట్లకు దక్కించుకుంది.

వెంకటేశ్ అయ్యర్ తర్వాత లెఫ్టార్మ్ పేస్ ఆల్‌రౌండర్ అయిన మంగేష్ యాదవ్‌ను రూ. 5.20 కోట్ల భారీ ధరకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన మంగేష్ యాదవ్‌ను కూడా రజత్ పటీదార్ సూచనలతోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావడంతో పాటు చివర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో ఆర్‌సీబీ అతనిపై కోట్లు కుమ్మరించింది. ట్రయల్స్‌లో పరీక్షించే ఈ ఆటగాడిని తీసుకున్నట్లు అర్థమవుతుంది. మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో మంగేష్ యాదవ్ 6 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు పడగొట్టాడు.
ఇందులో మూడు సార్లు నాలుగు వికెట్ల హాల్స్ ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 12 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. మంగేష్ యాదవ్ డెత్ ఓవర్లలో అత్యంత కచ్చితత్వంతో యార్కర్లు వేయగలడు. యశ్ దయాల్‌కు బ్యాకప్‌గా మంగేష్ యాదవ్‌ను తీసుకున్నట్లు అర్థమవుతుంది. న్యూజిలాండ్ పేసర్ జాకోబ్ డఫ్ఫీని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. బ్యాకప్ పేసర్‌గా ఉపయోగించుకోనుంది. ఈ ముగ్గురితో పాటు దేశవాళీ క్రికెటర్లు సత్విక్ దేస్వాల్, జోర్డాన్ కాక్స్, విక్కీ ఓస్ట్‌వాల్, విహాన్ మల్హోత్రా, కాన్షిక్ చౌహన్‌లను వారి కనీస ధర రూ.30 లక్షలకు తీసుకుంది.
పేపర్‌పై ఆర్‌సీబీ కట్టుదిట్టంగా ఉంది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో పాటు బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, పేసర్లతో సమతూకంగా కనిపిస్తోంది. 8వ స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. బ్యాకప్ ప్లేయర్లు బాగున్నారు. గత సీజన్ తరహాలో సమష్టిగా రాణిస్తే.. ఆర్‌సీబీ టైటిల్ నిలబెట్టుకోనుంది.
వెంకటేష్ అయ్యర్ (రూ. 7 కోట్లు), జాకబ్ డఫీ (రూ. 2 కోట్లు), సాత్విక్ దేశ్వాల్ (రూ. 30 లక్షలు), మంగేష్ యాదవ్ (రూ. 5.2 కోట్లు), జోర్డాన్ కాక్స్ (రూ. 75 లక్షలు), విక్కీ ఓస్ట్వాల్ (రూ. 30 లక్షలు), విహాన్ మల్హోత్రా (రూ. 30 లక్షలు), కనిష్క్ చౌహాన్ (రూ. 30 లక్షలు).
రజత్ పటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకోబ్ బెతెల్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిక్ సలామ్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ