టీమిండియాతో రెండో టెస్ట్‌లో ఓడినా.. తమ ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ అన్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత తమ జట్టు 100 ప్లస్ ఓవర్లు బ్యాటింగ్ చేసిందని సంతోషం వ్యక్తం చేశాడు. న్యూఢిల్లీ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోస్టన్ చేజ్.. ఈ మ్యాచ్‌లో ఓడినా జట్టుగా తమకు ఎన్నో సానుకూలంశాలు లభించాయని చెప్పాడు. 'ఈ మ్యాచ్‌లో ఓడినా మాకు సానుకూల అంశాలు ఉన్నాయి. కాంప్‌బెల్, షైహోప్ అద్భుతంగా ఆడి సెంచరీలు చేశారు. జట్టు కోసం అద్వితీయమైన పోరాటం చేశారు. దాంతో సుదీర్ఘ కాలం తర్వాత మేం 100 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేశాం. ఇది ఒక సానుకూల అంశం అయితే ఆటను చివరి రోజు వరకు తీసుకెళ్లడం మరో గొప్ప విషయం.
80 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడానికి మేం ఎప్పుడూ ప్రయత్నిస్తాం. అందుకు కావాల్సిన మార్గాలను కనుగొంటున్నాం. స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బ్యాక్‌ఫుట్‌లో ఆడటం, స్వీప్ షాట్స్ ఆడటం, ఫుట్ వర్క్ ఉపయోగించడం వంటి వ్యూహాలను రచించాం. ఈ ప్రణాళికలను మైదానంలో సమర్థవంతంగా అమలు చేశాం.

మా జట్టులో ఉన్న ఆటగాళ్లు కరేబియన్‌లోనే అత్యుత్తమ ప్లేయర్లు. ఈ చివరి టెస్ట్‌ను అప్‌కమింగ్ సిరీస్‌కు పునాదిగా.. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేదిగా ఉపయోగించుకుంటాం. ఇక నుంచి ఎంత వీలైతే అంత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తుంటాం.'అని అని రోస్టన్ చేజ్ చెప్పుకొచ్చాడు.
121 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 63/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 35.2 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కేఎల్ రాహుల్(108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్‌కు 2 వికెట్లు దక్కగా.. జోమెల్ వారికన్‌కు ఓ వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‌కు భారీ ఆధిక్యం తగ్గింది. దాంతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. జాన్ కాంప్‌బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115), షైహోప్(214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103) సెంచరీలతో చెలరేగగా.. జస్టిన్ గ్రీవ్స్(85 బంతుల్లో 3 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.
జైడెన్స్ సీల్స్(32)తో కలిసి జస్టిన్ గ్రీవ్స్ ఆఖరి వికెట్‌కు 79 పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(3/44), కుల్దీప్ యాదవ్(3/104) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌కు చెరో వికెట్ దక్కింది.