Romario Shepherd: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని వెస్టిండీస్ ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-సీలో భాగంగా స్కాట్లాండ్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫెర్డ్ (5/20) హ్యాట్రిక్ వికెట్‌తో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీ తొలి రోజే అతను హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఆడే రొమారియో షెఫెర్డ్ ఈ మ్యాచ్ 17వ ఓవర్లో హ్యాట్రిక్ సాధించాడు. అతని ధాటికి స్కాట్లాండ్ బ్యాటర్లు క్రాస్, లీస్క్, డేవిడ్‌సన్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. ఇదే ఓవర్ ఆరో బంతికి షరిఫ్‌ను కూడా రొమారియో షెఫెర్డ్ ఔట్ చేయడంతో ఒకే ఓవర్లో 4 వికెట్లు దక్కాయి. మొత్తం 3 ఓవర్లు బౌలింగ్ చేసిన షెఫెర్డ్ 20 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్(36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బ్రాండన్ కింగ్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35) దూకుడుగా ఆడాడు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాండ్ కర్రీ(2/22) రెండు వికెట్లు తీయగా.. సఫ్యాన్ షరీఫ్, ఒలివర్ డేవడ్సన్, మైఖేల్ లీస్క్ తలో వికెట్ తీసారు.
అనంతరం స్కాట్లాండ్ 18.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), టామ్ బ్రూస్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెఫెర్డ్‌తో పాటు జాసన్ హోల్డర్(3/30) మూడు వికెట్లు తీసాడు. షెమర్ జోసెఫ్, గుడకేష్ మోతీ తలో వికెట్ తీసారు.