టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఈ మ్యాచ్ చివర్లో బౌండరీ లైన్‌పై సూర్యకుమార్ యాదవ్ అందుకున్న క్యాచ్ ఆటను మలుపు తిప్పిన విషయం తెలిసిందే.
ఈ క్యాచ్ ఈ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. క్రికెట్ చరిత్రలోనే ఓ గొప్ప క్యాచ్‌గా నిలిచిపోయింది. సూర్య అందుకున్న ఈ క్యాచ్ ఎంత పాపులర్ అయ్యిందో అంతే వివాదాస్పదమైంది కూడా. సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో సూర్య స్టన్నింగ్ క్యాచ్‌తో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్‌లో ఫుల్‌టాస్‌గా వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు.

దాదాపు సిక్సర్‌గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్‌పై చాకచక్యంగా అందుకున్నాడు. ముందుగా సిక్సర్‌ను అడ్డుకొన్న సూర్య.. తర్వాత సమన్వయం కోల్పోవడంతో బంతిని గాల్లోకి విసిరేసాడు. బౌండరీ రోప్ దాటి, మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకొని క్యాచ్ పూర్తి చేశాడు.
ఈ క్యాచ్ అందుకోవడంలో సూర్య ఏ మాత్రం తప్పిదం చేసినా టీమిండియా ఓటమిపాలయ్యేది. అయితే ఈ క్యాచ్ అందుకునే క్రమంలో సూర్య బౌండరీ లైన్ తాకడని, బౌండరీ లైన్‌ను వెనక్కు జరిపారని కొందరు నెటిజన్లు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ అసత్య ఆరోపణలనే విషయం స్పష్టమైంది.
తాజాగా సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టే సమయంలో రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఈ క్యాచ్‌ను దాదాపు సిక్సర్‌గా భావించిన రోహిత్ శర్మ మ్యాచ్‌పై ఆశలు వదులుకున్నాడు. కానీ సూర్య స్టన్నింగ్ క్యాచ్‌తో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మ్యాచ్‌కు హాజరైన ఓ అభిమాని తన మొబైల్‌లో రోహిత్ రియాక్షన్‌ను రికార్డ్ చేశాడు.