వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు విజయం కోసం ఆడటం ముఖ్యమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రపంచకప్ విజయం లేకుండా శతకాలు, రికార్డులు సాధించడం అనవసరమని అభిప్రాయపడ్డాడు. రికార్డులు, శతకాలు అన్ని అతిగా గుర్తించబడుతాయని తెలిపాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ నేపథ్యంలో రోహిత్ శర్మ అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమాతో మాట్లాడాడు.
వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో రికార్డులు, అంకెలు చాలా చిన్నవని రోహిత్ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను 5 శతకాలు నమోదు చేశానని, కానీ చివరకు ఓటమే ఎదురైందని తెలిపాడు. ఈ క్రమంలోనే తాను పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అందుకోగానే.. నెంబర్స్ కోసం కాకుండా స్వేచ్చగా ఆడేలా మార్పు తీసుకురావాలనుకున్నానని చెప్పుకొచ్చాడు.

'నేను జట్టులో ఒక నిర్దిష్ట మార్పు తీసుకురావాలనుకున్నా. ఆటగాళ్లంతా మైదానంలోకి వెళ్లి స్వేచ్చగా ఆడేలా చేయాలనుకున్నా. గణంకాలతో కూడిన క్రికెట్‌ను పక్కనపెట్టాలనుకున్నాను. జనాలు క్రికెట్ రికార్డ్స్, వ్యక్తిగత గణంకాలను చూడటం లేదు. కేవలం ఆటను మాత్రమే ఆస్వాదిస్తున్నారు. గణంకాలు ఎప్పుడూ అతిగా అంచనవేయబడుతాయి.
భారత్‌లో క్రికెట్ రికార్డ్స్, సెంచరీల గురించి ఎక్కువ మాట్లాడుతారు. అయితే 2019 వన్డే ప్రపంచకప్‌లో నేను 5 సెంచరీలు సాధించాను. కానీ ఏమి జరిగింది? మేం ఓడిపోయాం. మూడు ఫార్మాట్లలో జట్టుకు సారథ్యం వహించడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. అయితే కోర్ గ్రూప్‌లో ఒకడిగా ఉంటే మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడం పెద్ద కష్టం కాదు.
కెప్టెన్‌గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత కష్టమైనా భరించాలి. భారత కెప్టెన్‌గా అవకాశం వచ్చినప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఫీలయ్యాను. గత 7-8 ఏళ్లుగా నేను కోర్ గ్రూప్‌లో భాగంగా ఉన్నాను. వైస్ కెప్టెన్‌గా కీలక నిర్ణయాల్లో భాగమయ్యాను. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌ల్లో సారథ్యం కూడా వహించాను.
దేశానికి సారథ్యం వహించడం గొప్ప గౌరవం. ఎంతో మంది దిగ్గజ సారథులను చూస్తూ పెరిగిన నేను.. వారి సరసన నిలిచే అవకాశం దక్కడం గొప్పగా ఉంది. ఇది గొప్ప అవకాశం కూడా'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.