
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు ఈ ఏడాది మొత్తం ఐదుగురు క్రీడాకారులు అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డును సొంతం చేసుకోనున్నారు. విశ్రాంత న్యాయమూర్తి ముకుందమ్ శర్మ నేతృత్వంలోని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లతో కూడిన 12 మంది సభ్యుల కమిటీ సిఫారసు చేసిన క్రీడా పురస్కారాల జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో జాతీయ క్రీడల దినోత్సవం ఆగస్టు 29న ఆన్‌లైన్ వేదికగా జరిగే కార్యక్రమంలో ఎంపికైన ఆటగాళ్లకు అవార్డులను అందజేయనున్నారు.
ఖేల్ రత్నకు మొత్తం ఐదుగురు ఆటగాళ్లను ఎంపిక చేసిన కమిటీ.. అర్జున అవార్డుకు 29 మందిని, ద్రోణాచార్యకు లైఫ్‌టైమ్ కేటగిరిలో 8 మందిని, రెగ్యూలర్ కేటగిరిలో ఐదుగురిని సీఫార్సు చేసింది. ఇక అర్జున అవార్డుకు 27 మందిని, ధ్యాన్ చంద్‌కు 15 మందిని రికమెండ్ చేసింది. అయితే రెజ్లర్ సాక్షి మాలిక్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు అర్జున పురస్కారాలు ఇవ్వడానికి నిరాకరించింది. మొత్తం 27 మందికి అర్జున అవార్డును ప్రకటించింది.
సాక్షి, మీరాబాయి గతంలోనే ఖేల్‌రత్న అందుకోవడంలో ఎంపిక కమిటీ నిర్ణయంపై కొందరు పెదవి విరిచారు. అత్యున్నత పురస్కారమైన ఖేల్‌రత్న వచ్చాక అంతకన్నా తక్కువ విలువైన అర్జున ఎందుకని ప్రశ్నించారు. ఇక క్రీడాచరిత్రలోనే రాజీవ్ ఖేల్ రత్నను ఐదుగురిని అందుకోవడం ఇదే తొలిసారి కాగా చివరిసారిగా 2016లో పీవీ సింధు, దీపా కర్మాకర్, జీతూ రాయ్, సాక్షి మాలిక్‌లో మొత్తం నలుగురిని వరించింది.
ఈ సారి రోహిత్‌తో పాటు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ (టీటీ) సంచలనం మనికా బాత్రా, రియో (2016) పారా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ ఖేల్‌రత్న అందుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా బాక్సర్ నగిశెట్టి ఉషకు ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య అవార్డు లభించింది. వైజాగ్‌కు చెందిన 36 ఏళ్ల ఉష 2006 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం, 2008 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, 2008 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆరుసార్లు సీనియర్ నేషనల్ చాంపియన్‌గా నిలిచింది. ఆట నుంచి రిటైరయ్యాక ఉష 2013 నుంచి 2017 మధ్యకాలంలో పలువురు మహిళా బాక్సర్లకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖ లోకో షెడ్‌లో పని చేస్తుంది.