టీమిండియా వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డే ప్రపంచకప్ 2027 గెలవడమే తన లక్ష్యమని చెప్పాడు. కానీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు మాత్రం హిట్‌మ్యాన్ ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగుతాడా? కొనసాగినా ఫామ్‌లో ఉంటాడా? అనే సందేహంలో ఉన్నారు.
ఈ క్రమంలోనే అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి శుభ్‌మన్ గిల్‌ను నయా సారథిగా ఎంపిక చేశారు. వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఈ విషయాన్ని రోహిత్ శర్మకు చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే ప్రపంచకప్ 2027 ఆడే విషయంపై క్లారిటీ ఇవ్వలేదని కూడా చెప్పాడు. ఈ లెక్క ప్రకారం ఫామ్‌లో ఉంటేనే ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో కొనసాగుతారని అగార్కర్ పరోక్షంగా హింట్ ఇచ్చాడు.

మరోవైపు రోహిత్ శర్మ మాత్రం వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా సిద్దమవుతున్నాడు. ఇందు కోసం అతను మాస్టర్ ప్లాన్ రచించాడు. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన రోహిత్.. బరువు తగ్గాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా ఆడుతుండగానే.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) సీఓఈలో చేరి ఫిట్‌నెస్ టెస్ట్‌ల్లో పాల్గొన్నాడు. వాటిలో నెగ్గి బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
సెప్టెంబర్ 16 నుంచి బెంగళూరులో దాదాపు వారం రోజులు గడిపిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా కండిషన్స్‌కు తగ్గట్లు సన్నదమయ్యాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లను దృష్టిలో పెట్టుకొని నెట్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా పొడవైన బౌలర్లను ఎదుర్కొన్నాడు. ప్రతీ రోజు రెండు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతని ప్రాక్టీస్‌కు 10 మంది బౌలర్లు, త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు సాయం చేశారు.
ఆస్ట్రేలియా పర్యటన రోహిత్ శర్మకు సవాల్‌తో కూడుకున్నది. 2022 తర్వాత అతను తొలి సారిగా ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టులో కొనసాగుతాడు. లేదంటే తుది జట్టులో చోటు కూడా ఉండదనే విషయం రోహిత్‌కు తెలుసు. ఈ క్రమంలోనే ఇందుకు అనుగుణంగా రోహిత్ మానసికంగా సిద్దమవడంతో పాటు బ్యాటర్‌గా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. రోహిత్ శర్మ కఠోర సాధన చూస్తుంటే అంత సులువుగా అతను భారత జట్టును వీడేలా కనిపించడం లేదు. 2027 వన్డే ప్రపంచకప్ గెలిచే రిటైర్మెంట్ ప్రకటించాలనే కసితో రోహిత్ ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో రోహిత్ శర్మ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.