ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు తమ సారథి హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల తర్వాత తన అభిమానులకు హార్దిక్ పాండ్యా విషయంలో కీలక సూచనలు చేశాడు. ఎగతాళి చేయడం ఆపి చప్పట్లతో ఎంకరేజ్ చేయాలని సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను క్యాష్ డీల్ ద్వారా ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. అతనికే సారథ్య బాధ్యతలు అప్పగించింది. టీమ్ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

పాపం హార్దిక్ పాండ్యా..
ప్రతీ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యాను గేలి చేస్తున్నారు. మైదానంలో అతను ఏం చేసినా గట్టిగా అరుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మనే తమ కెప్టెన్ అంటూ హార్దిక్‌ను ఎగతాళి చేశారు. హార్దిక్ చేసే తప్పిదాలను భూతద్దంలో చూస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఎగతాళి చేయడం గత రెండు మ్యాచ్‌ల కంటే ఎక్కువైంది. సొంత జట్టు ఆటగాడనే విషయం మరిచి హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అతన్ని విలన్‌లా చూస్తున్నారు. టాస్ వేసినప్పటి నుంచి మ్యాచ్ అసాంతం అతన్ని గేలి చేశారు.
ఎగతాళి వద్దు..
ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసే సమయంలో అభిమానులకు రోహిత్ శర్మ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. హార్దిక్ పాండ్యాను గేలి చేయవద్దని చేతి సైగలతో సూచించాడు. టాస్ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్.. హార్దిక్ పాండ్యాకు అండగా నిలబడ్డాడు. అభిమానుల తీరును తప్పుబట్టాడు. గత రెండు మ్యాచ్‌లుగా మౌనంగా ఉన్న రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో మాత్రం హార్దిక్ పాండ్యాను గేలి చేయవద్దని ఫ్యాన్స్‌ను కోరాడు.
ఈ విషయంలో రోహిత్, హార్దిక్ ఫ్యాన్స్ రెండుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కెప్టెన్సీ మార్పు నిర్ణయం కారణంగా ముంబై ఇండియన్స్ జట్టు రెండు గ్రూప్‌లుగా విడిపోయిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దాంతోనే ముంబై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైందనే వాదన ఉంది.
ముంబై ఓటమి..
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21 బంతుల్లో 6 ఫోర్లతో 34), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 సిక్స్‌లతో 32) మినహా అంతా విఫలమయ్యారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 15.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 127 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రియాన్ పరాగ్(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.