టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం హిట్ మ్యాన్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఒకవేళ టీమిండియా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరకుంటే.. సిడ్నీ టెస్ట్‌తోనే సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
రిటైర్మెంట్ విషయంపై రోహిత్ శర్మ సెలెక్టర్లకు కూడా సమాచారం ఇచ్చారని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు. 'పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాడు. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకుంటే.. సిడ్నీ టెస్ట్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. సెలెక్టర్లకు కూడా సమాచారమిచ్చాడు. రోహిత్ శర్మ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.'అని సదరు అధికారి తెలిపాడు.

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకంజలో నిలిచింది. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. సిడ్నీ టెస్ట్ గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2-2తో టీమిండియా సమం చేయాలి. అప్పుడు శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్ డ్రా అయినా.. ఒక మ్యాచ్‌లో ఆసీస్ ఓడినా.. భారత్ ఫైనల్ చేరుతోంది.
ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో స్థానం కోసం ఆసీస్, భారత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సిడ్నీ టెస్ట్ గెలిస్తే టీమిండియాకు అవకాశాలు ఉన్నాయి. శ్రీలంక పర్యటనలో స్పిన్ వికెట్‌పై ఆసీస్ గెలవడం కష్టమే. కాబట్టి సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా గెలవాలి. ఈ మ్యాచ్ ఓడితే.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
గత 15 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. తాజా ఆసీస్ పర్యటనలోనూ దారుణంగా విఫలమయ్యాడు. పేలవ బ్యాటింగ్‌తో అతను జట్టుకు భారమయ్యాడు. కెప్టెన్‌గానూ తడబడుతున్నాడు. కెప్టెన్ కాకుంటే రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు కూడా దక్కేది కాదని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్, ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.