టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన భవితవ్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ.. కెప్టెన్‌గానూ విఫలమవుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్.. అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గానూ తడబడుతున్నాడు.
శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోవడంతో పాటు సొంతగడ్డపై ఎన్నడూ లేని విధంగా టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అవ్వడం.. ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-3తో చేజార్చుకోవడంతో రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరి 8 టెస్ట్‌ల్లో టీమిండియాకు కావాల్సిన మూడు విజయాలను రోహిత్ అందించలేకపోయాడు. దాంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకోలేకపోయింది.

పేలవ బ్యాటింగ్‌తో ఆసీస్‌తో చివరి టెస్ట్‌కు రోహిత్ శర్మనే స్వయంగా తప్పుకున్నాడు. తుది జట్టు నుంచి తప్పుకున్న టీమిండియా కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. పేలవ బ్యాటింగ్, చెత్త కెప్టెన్సీ నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. జట్టు నుంచి తప్పుకొని కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శనపై ఇటీవలే బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరయ్యాడు. జట్టు పేలవ ప్రదర్శనతో పాటు సిరీస్ మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడం వంటి విషయాలపై బీసీసీఐ వివరణ కోరినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు అధికారికంగా బయటకు రాలేదు. కానీ అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని గౌతమ్ గంభీర్ బీసీసీఐకి సూచించనట్లు వార్తలు వచ్చాయి. విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులను ఎక్కువ రోజులు అనుమతించకూడదని, యో యో టెస్ట్‌ను మళ్లీ నిర్వహించాలని గంభీర్.. బీసీసీఐని కోరినట్లు.. అందుకు బోర్డు అంగీకరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు రోహిత్ శర్మ.. ఫ్యూచర్ కెప్టెన్‌ను సిద్దం చేసుకోవాలని బీసీసీఐకి సూచించినట్లు సమాచారం. తన వల్లే జట్టుకు సమస్యలు ఏర్పడితే.. తక్షణమే తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నానని కూడా రోహిత్ బోర్డుకు తెలియజేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అలా కాకుండా మరో కెప్టెన్‌ను సిద్దం చేసే వరకు కూడా జట్టులో కొనసాగేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రోహిత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం సీనియర్ ఆటగాళ్ల భవితవ్యంపై క్లారిటీ రానుంది. ఈ టోర్నీ మెరుగ్గా రాణిస్తే సీనియర్ ఆటగాళ్లు జట్టులో కొనసాగుతారు. అలా కాకుండా పేలవ ప్రదర్శన కనబరిస్తే మాత్రం బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.