
కోల్‌కతా: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సంబంధించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న రోహిత్ సేన.. మూడు టీ20ల సిరీస్ కోసం కోల్‌కతాకు చేరుకుంది. ఫిబ్రవరి 16న విండీస్‌తో తొలి టీ20 ఆడనుంది. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న ఆటగాళ్లు.. హోటల్ గదిలో ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. అంతా ఒక్క చోట చేరి ఆసక్తిగా గమనిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను రోహిత్ శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు.
ఈ ఫొటోలో యుజ్వేంద్ర చాహల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్నారు. దీనికి 'కొంతమంది సంతోషంగా ఉంటే మరికొందరూ టెన్షన్‌గా ఉన్నారు'అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఇదే హయ్యెస్ట్. వేలం ఆరంభంలోనే శ్రేయస్ అయ్యర్‌ను రూ.12.25 కోట్ల ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్‌గా అతన్నే నియమించే అవకాశం ఉంది. రిషభ్ పంత్, సూర్యలను తమ జట్లు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.
దాంతో వీళ్లంతా సంతోషంగా ఉండగా.. శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్ కొంత టెన్షన్‌గా కనిపించారు. అయితే వేలంలో వీరికి మంచి ధరనే లభించింది. రూ.6.5 కోట్లకు చాహల్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయగా.. శార్దూల్ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక రోహిత్ శర్మ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
వెస్టిండీస్‌తో మూడో వన్డే విజయం తర్వాత రోహిత్ ఐపీఎల్ మెగా వేలంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ప్రతి ఒక్కరూ, ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోని ఆటగాళ్లు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఏం జరుగుతుందోనని ఆసక్తిగా చూస్తారు. నేను మాత్రం నా ఫోన్ ను స్విచాఫ్ చేస్తాను'' అని చెప్పాడు.