
ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. తన కూతురు సమైరాకు సంబంధించిన ఆ ఫొటోను చూసి హిట్‌మ్యాన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక రోహిత్‌కు తన కూతురు సమైరా అంటే ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సమైరాతో సరదాగా గడపటానికి హిట్ మ్యాన్ ప్రాధాన్యమిస్తాడు. అందుకే టీమిండియా, ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్న సమయంలో రోహిత్ తనతో పాటు భార్య రితిక సజ్దే, కూతురు సమైరాను వెంట తీసుకెళ్తాడు. తన కూతురుతో ఆడుకుంటున్న వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు.
గురువారం కూడా తన గారాలపట్టి సమైరాను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఓ ఫొటోను రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దానికి 'ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా' అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. 2015లో రితికా సజ్దెదీని రోహిత్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు 2018లో సమైరా జన్మించింది.
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్దాంతరంగా వాయిదాపడటంతో ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో రోహిత్‌కు చోటు దక్కింది. ఈ సుదీర్ఘ పర్యటన కోసం బీసీసీఐ ముంబైలో బయో బబుల్ ఏర్పాటు చేసింది.
ఇప్పటికే ఆ టూర్‌కు ఎంపికైన ఆటగాళ్లంతా ముంబైలోని బబుల్‌లోకి ప్రవేశించి క్వారంటైన్ పాటిస్తున్నారు. అయితే ముంబైలో నివసించే ఆటగాళ్లకు ఆలస్యంగా చేరే వెసులబాటు కల్పించారు. దాంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో సహా రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆలస్యంగా బబుల్‌లోకి రానున్నారు. ఇక్కడ 2 వారాల క్వారంటైన్ అనంతరం జూన్ 2న టీమిండియా జంబో టీమ్ ఇంగ్లండ్ పయనం కానుంది. అక్కడ మరో 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండనుంది.