
మా రూటూ సపరేటూ..
ఇతర జట్లను అనుసరించకుండా తమకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుంటామని హిట్ మ్యాచ్ చెప్పుకొచ్చాడు. 'చాలా ఏళ్ల నుంచి ఐసీసీ టైటిల్ గెలవలేదన్న మాటే కానీ.. భారత జట్టు టీ20 ఫార్మాట్లో ఎప్పుడూ బాగానే ఆడుతోంది. అయితే జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిదిద్దాలి. ఫలానా జట్టులా అవ్వాలని మేం ప్రయత్నించం. మా కంటూ ఓ స్టైల్ ఏర్పరుచుకుంటాం. ఈ ప్రపంచకప్ తర్వాత తాజాగా మొదలుపెడుతున్నాం. వచ్చే ఏడాది టోర్నీ కోసం కొన్ని ఆలోచనలతో ముందుకు సాగాలనుకుంటున్నాం.
జట్టులో కోహ్లీ పాత్ర ఎప్పట్లాగే ఉంటుంది. ఇప్పటిదాకా ఏం చేస్తున్నాడో ఇక ముందూ అదే చేస్తాడు. జట్టులో అతను చాలా కీలకమైన ఆటగాడు. విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఆడినా తనదైన ముద్ర వేస్తాడు. అతను తిరిగి జట్టులోకి వస్తే తన అనుభవం, బ్యాటింగ్ సామర్థ్యం వల్ల జట్టు బలం ఇంకా పెరుగుతుంది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

విఫలమైనా మద్దతిస్తాం..
టీ20 క్రికెట్‌లో ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఈ ఫార్మాట్ అంటేనే సాహసోపేత రీతిలో ఆడాల్సి ఉంటుందని రోహిత్ తెలిపాడు. అన్నిసార్లూ సక్సెస్ అవుతామనే గ్యారెంటీ ఉండదని, అందుకే ఆటగాళ్లకు తమ స్థానం పట్ల హామీ ఇవ్వాలని చెప్పాడు. ఆటగాళ్లు తమ సహజ శైలిలో ఆడేందుకు అవసరమైన మద్దతు తాను, కోచ్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఓ ఆటగాడు విఫలమైనా అతనికి ఇంకో అవకాశం ఇవ్వడానికి, తనలో ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు.

యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం..
జట్టులో కుర్రాళ్లను తీర్చిదిద్దడం చాలా కీలకమైన విషయమని, వెంకటేశ్ అయ్యర్ ఒక్కడినే కాకుండా అందరినీ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నాడు. జట్టుకు ఒక నాణ్యమైన బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరమున్న మాట వాస్తవమని, ఆ దిశగా దృష్టి పెడతామన్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్న కుర్రాళ్ల మీదా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని, టీ20ల్లో ఒక విజయవంతమైన జట్టుగా తయారు కావడానికి ఏం చేయాలో అన్నీ చేయడానికి ప్రయత్నిస్తామని రోహిత్ పేర్కొన్నాడు.

2007లో తొలిసారి..
రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోనే తొలి మ్యాచ్ ఆడానని, అప్పుడు ఆయనతో మాట్లాడటానికి కొంచెం భయపడ్డానని రోహిత్ చెప్పుకొచ్చాడు. '2007లో నేను భారత జట్టుకు ఎంపికైనపుడు బెంగళూరులో జరిగిన శిబిరంలో ద్రవిడ్‌తో తొలిసారి మాట్లాడే అవకాశం దక్కింది. బెరుగ్గా అనిపించి ఎక్కువసేపు మాట్లాడలేదు. తర్వాత ఐర్లాండ్‌తో సిరీస్ తొలి మ్యాచ్ ముంగిట ద్రవిడ్ నా దగ్గరికొచ్చి 'నువ్వీ మ్యాచ్ ఆడుతున్నావు' అనగానే చంద్రుడిపై వెళ్లినట్లు అనిపించింది. ద్రవిడ్ స్థాయి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూంను పంచుకోవడం గొప్ప అనుభవం.'అని రోహిత్ గుర్తు చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications
