టీమిండియా ఘోర పరాజయాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన రూల్స్‌ను అమలు చేసేందుకు సిద్దమైనట్లు వచ్చిన వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ఈ రూల్స్ గురించి ఎవరు చెప్పారని, బీసీసీఐ అధికారిక ప్రకటించిందా? అని ప్రశ్నించాడు. అధికారికంగా విడుదలైన తర్వాత చర్చిద్దామని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడే భారత జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టు ఎంపికపై కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శనివారం సుదీర్ఘ సమావేశం నిర్వహించిన అగర్కార్ అనంతరం.. హిట్ మ్యాన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి బీసీసీఐ గైడ్‌లైన్స్ గురించి ప్రశ్నించగా రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు.

'ఈ రూల్స్ గురించి మీకు ఎవరు చెప్పారు? బీసీసీఐ అధికారిక ఖాతాల నుంచి ఏమైన ప్రకటన వచ్చిందా? వచ్చిన తర్వాత ఈ రూల్స్‌పై చర్చిద్దాం'అని రోహిత్ శర్మ విరుచుకుపడ్డాడు. బీసీసీఐ రూల్స్ గురించి అజిత్ అగార్కర్ మాట్లాడినప్పుడు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎందుకు సమాధానమివ్వడని సదరు రిపోర్టర్ అసహనం వ్యక్తం చేశాడు.
ప్రెస్ మీట్ ముగిసిన అనంతరం ఫ్యామిలీ కండిషన్స్ గురించి మాట్లాడితే ఆటగాళ్లంతా తనకు ఫోన్ చేస్తారని రోహిత్ నవ్వుతూ మీడియాతో ప్రతినిధులతో అన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
ఆటగాళ్లకు పనిష్మెంట్ ఇవ్వడానికి ఇదేం స్కూల్ కాదని చురకలంటించాడు. అవి రూల్స్ మాత్రమేనని, పనిష్మెంట్ కాదని అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. 'నాకు తెలిసి ప్రతీ జట్టుకు కొన్ని రూల్స్ ఉంటాయి. సమీక్ష సమావేశంలో మేం చాలా విషయాల గురించి మాట్లాడాం. గత కొన్ని నెలలుగా టీమిండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో కొన్ని మార్పులు చేయడంతో పాటు టీమ్ బాండింగ్ పెంచాలనుకున్నాం.
ఇదేం స్కూల్ కాదు. ఈ రూల్స్ పనిష్మెంట్ కాదు. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల కోసం కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఎవరైనా పాటించాల్సిందే. ఆటగాళ్లేం స్కూల్ పిల్లలు కాదు. వాళ్లంతా సూపర్ స్టార్స్. వారిని వారు ఎలా సమన్వయపరుచుకోవాలో వారికి బాగా తెలుసు. అయితే ఎవరైనా దేశం కోసం ఆడుతున్నప్పుడు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అక్కడ చాలా రూల్స్ ఉండేవి. కాలానుగుణంగా అవి మారుతూ వస్తున్నాయి.'అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు.