ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చేజింగ్ చేయడం తమ జట్టు బలమనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఇది మాకు కలిసొచ్చే అంశం. చేజింగ్‌లో మాకు మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా వాంఖడే వికెట్‌లో భారీ లక్ష్యాలను కూడా చేధించాం. వికెట్ బాగుంది. కాస్త గడ్డి, ప్యాచెస్‌తో ఎప్పుడూ ఉండే ముంబై పిచ్‌లానే ఉంది. అయితే పిచ్ ఎలా స్పందిస్తుందో అనేదాన్ని కచ్చితంగా చెప్పలేను.

కానీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ మ్యాచ్ గెలవడం ఎంత ముఖ్యమో మాకు బాగా తెలుసు. కానీ మన ఆధీనంలో ఉన్నవాటినే మనం చేయగలం. మేం మంచి క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంది. మిగతాది కాలమే నిర్ణయిస్తోంది. జోఫ్రా ఆర్చర్ జట్టుకు దూరం కాగా.. క్రిస్ జోర్డాన్ ముంబై తరఫున అరంగేట్రం చేస్తున్నాడు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. 'సాధారణంగా ఇక్కడ చేజ్ చేయడం సులువు. పిచ్ స్వభావమే అలా ఉంటుంది. అయితే భారీ లక్ష్యాలను నమోదు చేస్తే ఎంతటి జట్టునైనా ఒత్తిడిలోకి నెట్టవచ్చు. వారికి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది.
వారి బ్యాటింగ్ సందర్భంగా మేం వికెట్లు తీస్తామనే నమ్మకం ఉంది. మూడు, నాలుగో స్థానాల్లో నిలిచే జట్ల మధ్య చాలా పోటీ ఉండనుంది. మంచి క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంది. టీమ్ ప్రణాళికలో భాగంగా జట్టులో ఓ మార్పు చేశాం. కర్ణ్ శర్మ స్థానంలో వైశాఖ్ విజయ్ కుమార్ జట్టులోకి వచ్చాడు.'అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలుపొందింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఆర్‌సీబీపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.
తుది జట్లు:
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, విజయ్ కుమార్ వైశాఖ్, మహమ్మద్ సిరాజ్, జోష్ హజెల్ వుడ్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్, నెహాల్ వదేర, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తీకేయ, జాసన్ బెహ్రెండార్ఫ్