పేలవ బ్యాటింగ్‌తోనే సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో తమ బ్యాటింగ్ స్థాయికి తగినట్లు లేదని చెప్పాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా.. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. పేలవ బ్యాటింగ్‌కు తోడుగా బౌలింగ్ వైఫల్యం కూడా తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. పిచ్‌కు తగినట్లు తమ బౌలర్లు బౌలింగ్ చేయలేకపోయారని చెప్పాడు.

'ఈ మ్యాచ్‌లో మేం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో గౌరవ ప్రదమైన స్కోర్ అందుకున్నాం. కానీ పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. రెండో ఇన్నింగ్స్‌లో మా బ్యాటింగ్ మరీ చెత్తగా ఉంది. విరాట్ కోహ్లీ ఒక్కడే అద్భుతంగా ఆడాడు. టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే సమష్టిగా రాణించాలి. కానీ ఈ విషయంలో మేం విఫలమయ్యాం.
కుర్రాళ్లకు ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో మాకు తెలుసు. ప్రతీ ఒక్కరికి తమ సొంత ప్రణాళిక ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో విభిన్న సమయాల్లో మా బ్యాటర్లకు సవాల్ ఎదురైంది. పరిస్థితులను మేం అందిపుచ్చుకోలేకపోయాం. రెండు ఇన్నింగ్స్‌లో మరి దారుణంగా బ్యాటింగ్ చేశాం. అందుకే ఓటమిపాలయ్యాం.
ఈ పిచ్‌పై ఎలా ఆడాలో కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్‌తో చూపించాడు. మా బౌలర్లను విమర్శించాల్సిన అవసరం లేదు. వారికి ఇక్కడ ఆడిన అనుభవం ఎక్కవగా లేదు. వీలైనంత త్వరగా ఈ ఓటమి నుంచి తేరుకుంటాం. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమే. కానీ క్రీడాకారులుగా ఇలాంటి సమయాల్లోనే మనం ఏంటో చూపించాలి.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 131 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(82 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 76) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కోహ్లీతో పాటు శుభ్‌మన్ గిల్(26) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబడాకు రెండు వికెట్లు దక్కాయి.
256/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 108.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డీన్ ఎల్గర్(287 బంతుల్లో 28 ఫోర్లతో 185) భారీ శతకానికి తోడుగా.. టెయిలెండర్ మార్కో జాన్సెన్(147 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 84 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.