టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ముందుగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. అతన్ని అనుసరిస్తూ రోహిత్ శర్మ కూడా టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించాడు.
వాస్తవానికి తాను టీ20 క్రికెట్ నుంచి తప్పుకోవాలనే ఆలోచనే చేయలేదని రోహిత్ శర్మ తెలిపాడు. పరిస్థితులు డిమాండ్ చేయడంతోనే అప్పటికప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సౌతాఫ్రికాతో శనివారం ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంతో 11 ఏళ్ల తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఆ ఆలోచనే లేదు..
ఈ విజయానంతరం రోహిత్ శర్మ మీడియా ప్రతినిథులతో చిట్‌చాట్ చేశాడు. ఈ సందర్భంగా తన రిటైర్మెంట్‌కు గల కారణాన్ని వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచినా.. పొట్టి ఫార్మాట్‌లో కొనసాగాలనుకున్నానని, కానీ రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇంతకు మించిన మంచి సమయం లేదనిపించిందన్నాడు.
'అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకోవాలనే ఆలోచనే నాకు లేదు. కానీ పరిస్థితులు ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయి. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే మంచి సమయమనిపించింది. ప్రపంచకప్ గెలిచిన సందర్భం కంటే గొప్ప సమయం ఏం ఉంటుంది. అందుకే టీ20లకు వీడ్కోలు పలికాను.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ టీ20లకు దూరమైనా.. ఐపీఎల్‌లో కొనసాగుతానని హిట్ మ్యాన్ స్పష్టం చేశాడు.
ఈ ఫార్మాట్‌ను ఆస్వాదించాను..
ఇక అంతకుముందు మీడియా సమావేశంలో రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 'భారత్ తరఫున ఇదే నా చివరి టీ20 మ్యాచ్. నిజాయితీగా చెబుతున్నా ఈ ఫార్మాట్ ఆడుతున్నప్పటి నుంచి ఆటను చాలా ఆస్వాదించాను. ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకు మించిన మంచి సమయం లేదు. నా టీ20 కెరీర్‌లో ప్రతీ మూమెంట్‌ను ఆస్వాదించాను.
ఈ ఫార్మాట్‌తోనే టీమిండియా తరఫున నా అంతర్జాతీయ కెరీర్ మొదలైంది. ప్రపంచకప్ గెలవాలనుకున్నాను. గెలిచాను కాబట్టి గుడ్ బై చెబుతున్నాను.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బాటలోనే రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు.