రాజ్‌కోట్: వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో తాము చేసిన ప్రయోగం బెడిసికొట్టిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 66 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మెగా టోర్నీ నేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లందరికి విశ్రాంతినిచ్చిన టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది.
ఈ ఓటమి అనంతరం తమ పరాజయంపై మాట్లాడిన రోహిత్ శర్మ.. మెగా టోర్నీ ముందు ఈ ఓటమి ఓ గుణపాఠమని తెలిపాడు. 'నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ముఖ్యంగా హిట్టింగ్ చేసిన విధానం నాకు సంతృప్తినిచ్చింది. గత 7-8 వన్డేలు మేం అద్భుతంగా ఆడాం. విభిన్నమైన పరిస్థితుల్లో.. భిన్నమైన జట్లతో మా సత్తాను పరీక్షించుకున్నాం.

మాకు మేం పెట్టుకున్న పరీక్షల్లో మా జట్టు పాస్ అయ్యింది. దురదృష్టవశాత్తు ఈ రోజు ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. జస్‌ప్రీత్ బుమ్రా ప్రదర్శన సంతోషానికి గురి చేసింది. ముఖ్యంగా గాయం నుంచి కోలుకోని పూర్తి ఫిట్‌నెస్ సాధించడం.. తన పూర్వవైభవాన్ని చాటుతూ చెలరేగడం జట్టుకు కలిసొచ్చే అంశం.
బుమ్రా అపార నైపుణ్యం కలిగిన బౌలర్. ప్రపంచకప్ బరిలోకి దిగే మా 15 మంది ఆటగాళ్లు ఎవరో అనేదానిపై క్లారిటీ ఉంది. ఈ విషయంలో ఎలాంటి అయోమయం లేదు. జట్టుగా మేం ఏ టోర్నీ ఆడుతున్నామనే విషయం మాకు తెలుసు. ఇది టీమ్ స్పోర్ట్. ప్రతీ ఒక్కరు రాణిస్తేనే విజేతలుగా నిలుస్తాం. ప్రపంచకప్ జరిగే నెలన్నర రోజులు గాయాల బారిన పడకుండా ఫిట్‌గా ఉంటూ ఫ్రెష్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 352 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 96), డేవిడ్ వార్నర్(34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56) విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగగా.. స్టీవ్ స్మిత్(61 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 74), మార్నస్ లబుషేన్(58 బంతుల్లో 9 ఫోర్లతో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు.

భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(3/81) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/48) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ (1/68), ప్రసిధ్ కృష్ణ(1/45) తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేదనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 81) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(61 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 56), శ్రేయస్ అయ్యర్(43 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 48) కీలక ఇన్నింగ్స్ ఆడారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(4/40) భారత్ పతనాన్ని శాసించాడు. జోష్ హజెల్ వుడ్(2/42) రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(1/59), కామెరూన్ గ్రీన్ (1/30), తన్వీర్ సంఘా(1/61) తలో వికెట్ తీసారు.