
మిడిలార్డర్ మెరుగవ్వాలి..
'ఈరోజు మ్యాచ్‌లో మంచు ప్రభావం అధికంగా ఉండటంతో బంతి.. బ్యాట్‌పైకి వచ్చింది. మా బ్యాటింగ్ విభాగం ఎలా ఆడాలనేదానిపై ముందే ప్రణాళికలు వేసుకున్నాం. అయితే, అది బాగా ఉపయోగపడిందని నేను అనుకోను. మిడిల్ ఆర్డర్‌లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. కేఎల్ రాహుల్ ఈరోజు ఆడకపోయినా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు మిడిల్ ఆర్డర్‌కు ఈరోజు మినహా పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సిరీస్ మొత్తంలో మా స్పిన్నర్లు బాగా రాణించారు. అశ్విన్, అక్షర్ బౌలింగ్ చేసిన తీరు బాగుంది. చాహల్ లయ అందుకున్నాడు. వెంకటేశ్ సైతం తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

లోయరార్డర్ చెలరేగాలి..
అలాగే ఇతర జట్లలోని ఆటగాళ్లు 8, 9 స్థానాల వరకూ బాగా ఆడుతున్నారు. భారత జట్టులోనూ ప్రతి ఒక్కరు రాణించాలి. హర్షల్ పటేల్ హరియాణా జట్టు తరఫున ఆడేటప్పుడు ఓపెనింగ్ చేస్తాడు. అలాగే దీపక్ చాహర్ శ్రీలంక పర్యటనలో ఎలా బ్యాటింగ్ చేశాడో మనం చూశాం. యుజువేంద్ర చాహల్ సైతం బ్యాటింగ్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. ఫుల్ షాట్ ఆడటం అంత ఈజీ కాదు. ఆ షాట్ సహజంగా రాదు. దానికోసం ఎంతో సాధన చేశాను. ఒక్కోసారి ఆ షాట్ బాగా కుదురుతుంది. కానీ కొన్ని సార్లు మాత్రం ఔటవ్వాల్సి వస్తుంది. కాబట్టి, ఎవరికైనా మంచి నైపుణ్యం ఉంటేనే ఆ షాట్‌పై దృష్టిసారించాలి.

అశ్విన్ లాంటి బౌలర్ ఉండాలి..
మధ్య ఓవర్లలో పరుగుల వరదను ఆపాలన్నా.. కీలక సమయాల్లో వికెట్లు తీయాలన్నా.. అశ్విన్ లాంటి ఓ బౌలర్ జట్టులో ఉండాలి. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అశ్విన్ తన రీఎంట్రీ ఘనంగా చాటుకున్నాడు. మిడిల్ ఓవర్లలో పరుగులను కట్టడి చేస్తూనే.. కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతను చాలా ఏళ్లుగా టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా మంచి రికార్డే ఉంది. అతనో గొప్ప బౌలర్.

బౌలర్లదే క్రెడిట్..
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, టీ20 కెప్టెన్‌గా నేను బాధ్యతలు చేపట్టాక జట్టులో ఆరోగ్యకర వాతావరణం ఉండేలా చూశాం. ఆటగాళ్లు భయం లేకుండా స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించాం. ఒకవేళ ఎవరైనా విఫలమైనా మీ వెంట మేమున్నామనే భరోసా కల్పించాం. ఈ సిరీస్ విజయంలో బౌలర్లు కీలకంగా వ్యవహరించారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న న్యూజిలాండ్ జట్టును మోస్తరు పరుగులకే పరిమితం చేయడం మాకు కలిసొచ్చింది' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడిన అశ్విన్ మూడు వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications
