
గౌహతి: సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తద్వారా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి టీ20 సిరీస్ విజయాన్నందుకుంది. టీ20 ప్రపంచకప్ ముందు ఈ సిరీస్ విజయం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నా.. బౌలింగ్ వైఫల్యమే కలవరపెడుతోంది. ఆదివారం జరిగిన మూడో టీ20లోనూ భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చుకున్నారు. టీమిండియా భారీ స్కోర్ చేయడంతో బచాయించింది. దాంతో మరోసారి టీమిండియా బౌలింగ్ వైఫల్యం చర్చనీయాంశమైంది. మ్యాచ్ అనంతరం ఇదే అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదని, కానీ మెరుగుపరుచుకోవాలన్నాడు.
'డెత్ ఓవర్ల అంశం ఆందోళన కలిగించకపోయినా.. మ్యాచ్ చివరలో జట్టు పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. జట్టు ఒక నిర్ధిష్ట పద్ధతితో బౌలింగ్ చేయాలని కోరుకుంటుంది. ఆ రకంగా బౌలర్లకు స్వేచ్ఛనివ్వాలనుకుంటాం. నిజమే.. గత ఐదారు మ్యాచ్‌ల్లో మేం డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయలేదు. ఈ అంశం మాకు సవాలు విసిరేది. అయితే.. డెత్ ఓవర్లలో బౌలింగ్, బ్యాటింగ్ చేయడం కష్టంతో కూడుకున్న పని. ఆట ఫలితం తేలేదీ ఇక్కడే. ఇది ఆందోళన చెందే విషయమని నేను చెప్పను. కానీ.. ఇది కచ్చితంగా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అంశం' అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. ఇక బ్యాటింగ్ యూనిట్ రాణించడంపై రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు. టీమ్‌గా ఎలా ఆడాలనుకున్నామో అలానే బ్యాటింగ్ చేస్తున్నామని చెప్పాడు. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా ప్రతీ ఒక్కరు రాణించడం కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ రెండు వికెట్లు తీసినా.. 62 పరుగులివ్వడం ఆందోళన కలిగిస్తోంది. అతను మూడు నోబాల్స్‌తో పాటు రెండు వైడ్లు వేసాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్), రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులే చేసింది. డేవిడ్ మిల్లర్(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్‌కు విజయానందమే లేకుండా చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసినా... 62 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. దీపక్ చాహర్(0/24) మినహా అంతా ధారళంగా పరుగులిచ్చారు. మూడో టీ20 మంగళవారం ఇండోర్ వేదికగా జరగనుంది.