సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా నెలకొల్పిన 60 పరుగుల కీలక భాగస్వామ్యమే తమ విజయానికి బాటలు వేసిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 47 పరుగులు తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(3/33), రషీద్ ఖాన్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) టాప్ స్కోరర్‌గా నిలిచారు. జస్‌ప్రీత్ బుమ్రా(3/7), అర్ష్‌దీప్ సింగ్(3/36) అఫ్గాన్ పతనాన్ని శాసించారు.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాతో పాటు జస్‌ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. జట్టుకు కావాల్సింది చేయడానికి బుమ్రా ఎప్పుడూ ముందుంటాడని తెలిపాడు. 'గత రెండేళ్లుగా మేం ఇక్కడికి వచ్చి కొన్ని టీ20 మ్యాచ్‌లు ఆడాం. ఆ అనుభవంతోనే మేం ఈ మ్యాచ్‌కు ప్రణాళికలను రచించాం.
పిచ్ కండిషన్స్‌ను అద్భుతంగా అందిపుచ్చుకున్నాం. మా బౌలింగ్ లైనప్ గురించి మాకు బాగా తెలుసు. మేం విధించిన లక్ష్యాన్ని సునాయసంగా డిఫెండ్ చేయగలమని అనుకున్నాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. మేం తరచూ ఈ తరహా ప్రదర్శన గురించే మాట్లాడుతుంటాం.
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా నెలకొల్పిన భాగస్వామ్యం మాకు కీలకంగా మారింది. బంతితో బుమ్రా ఏం చేస్తాడో మాకు బాగా తెలుసు. అయితే అతన్ని తెలివిగా వాడుకోవడం చాలా ముఖ్యం. అతను జట్టు కోసం కావాల్సింది చేయడంలో ముందుండే వ్యక్తి. నేను ఈ వికెట్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయగలిగాను. ప్రత్యర్థి టీమ్‌కు తగ్గట్లు తుది జట్టులో మార్పు చేసేందుకు మేం సిద్దం.
ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఉత్తమమని భావించాం. అందేకే ముగ్గురితో బరిలోకి దిగాం. ముందు ముందు పేసర్లు అవసరం అనుకుంటే నేను ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను ఆడిస్తాను.'అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.
90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును సూర్యకుమార్ యాదవ్.. హార్దిక్ పాండ్యాతో కలిసి ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరూ 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతోనే టీమిండియా 181 పరుగులు చేయగలిగింది.