
చెన్నై: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వైఫల్యంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మూడు వన్డేల సిరీస్‌లో మూడు బంతులు మాత్రమే ఆడటం దురదృష్టకరమని తెలిపాడు. అయితే అతను మూడు అద్భుతమైన బంతులకు ఔటయ్యాడని వెనకేసుకొచ్చాడు. అష్టన్ అగర్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే సూర్య క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్యాక్ ఫుట్ పంచ్‌తో ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేయగా.. ఇన్‌సైడ్ ఎడ్జ్ అయిన బంతి వికెట్లను గీరాటేసింది. అయితే తొలి రెండు వన్డేల్లో కూడా సూర్య గోల్డెన్ డకౌటవ్వడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఒకే తరహాలో ఎల్బీగా వెనుదిరిగాడు.
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మను సూర్య పేలవ ఆటతీరుపై ప్రశ్నించగా అతనికి అండగా నిలిచాడు. ప్రస్తుతం సూర్య విషమ దశను ఎదుర్కొంటున్నాడని చెప్పాడు. 'ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ మూడు బంతులు మాత్రమే ఆడాడు. దీనిని మీరు ఎంతవరకు పరిశీలిస్తున్నారో నాకు తెలియదు. కానీ అతను మూడు అద్భుతమైన బంతులకు ఔటయ్యాడనేది వాస్తవం. మూడో వన్డేలో అతను ఎదుర్కొన్న బంతి నా దృష్టిలో గొప్పది కాదు. కానీ అతను తప్పుడు షాట్ ఎంచుకున్నాడు. ఆ బంతిని ముందుకు వచ్చి ఆడాల్సింది.
అతను స్పిన్‌ను సమర్థవంతంగా ఆడగలడు. అందుకే అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపించకుండా ఆపాము. చివరి 15-20 ఓవర్లు ఆడాల్సిన బాధ్యతను అప్పజెప్పాం. కానీ దురుదృష్టవశాత్తు అతను గోల్డెన్ డకౌటయ్యాడు. ఈ సిరీస్‌లో మూడు బంతులు మాత్రమే ఆడాడు. ఇది ప్రతీ ఒక్కరికి జరిగేదే. అతని సామర్థ్యం, క్వాలిటీ ఎప్పటికీ అలానే ఉంటుంది. ప్రస్తుతం అతను కెరీర్‌లో విషమ దశను ఎదుర్కొంటున్నాడు.
లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమే అక్షర్ పటేల్‌కు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చాం. కేఎల్ రాహుల్, కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్లతో దాడికి దిగింది. ఐదో స్థానంలో సూర్య రావాల్సింది. కానీ బంతి తిరగడం గమనించి సూర్యను ఆపి లెఫ్టాండర్ అయిన అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌క పంపించాం. సూపర్ ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ను స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాలని చెప్పాం. హార్దిక్ పాండ్యా నెంబర్ 6 ఆప్షన్‌గా ఉండటం.. జడేజా, సూర్య ఇంకా బ్యాటింగ్ చేయాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇది మాకు కలిసి రాలేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.