రాజ్‌కోట్: వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియా నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవడం సానుకూలాంశమని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఈ నెంబర్ వన్ ర్యాంక్‌తో జట్టుకు ఒరిగేది ఏం లేదని, ప్రస్తుతం కాలంలో ఉంటూ మంచి క్రికెట్ ఆడితేనే విజయం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు.
నెంబర్ వన్ ర్యాంక్‌తో తమకు ఏం కొమ్ములు రాలేదని పరోక్షంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ప్రస్తుతం తమ జట్టులో 13 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉన్నారని చెప్పిన రోహిత్ శర్మ.. అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో చాలా మంది ఆటగాళ్లు చివరి వన్డేకు దూరమయ్యారని తెలిపాడు.

'మా జట్టులో కొందరు అస్వస్థతకు గురయ్యారు. మరికొందరు వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లారు. కొందరికి ప్రపంచకప్ నేపథ్యంలో రెస్ట్ ఇచ్చాం. దాంతో మూడో వన్డేకు 13 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
రవిచంద్రన్ అశ్విన్ సీనియర్ ప్లేయర్. అతని అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు మేం ఎప్పుడూ సిద్దంగా ఉంటాం. అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్‌లో వేరియేషన్స్ కూడా చూపిస్తున్నాడు. అవకాశం ఉంటే అతను ప్రపంచకప్ జట్టులోకి రావచ్చు. ప్రపంచకప్ టోర్నీకి బ్యాకప్స్ కూడా సిద్దంగా ఉండటం మాకు కలిసొచ్చే అంశం.
మెగా టోర్నీకి ముందు నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవడం టీమిండియాకు సానుకూలాంశం. అయితే దీని వల్ల జట్టుకు ఒరిగేది ఏం లేదు. ప్రస్తుత కాలంలో ఉంటూ మంచి క్రికెట్ ఆడితేనే విజయం దక్కుతుంది. నెంబర్ వన్ ట్యాగ్‌తో వచ్చే ఉపయోగం ఏం లేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. బుధవారం జరిగే చివరి వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేస్తే టీమిండియా అరుదైన ఘనతను సొంతం చేసుకుంటుంది. ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా చరిత్రకెక్కుతోంది.
తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనుండగా.. శుభ్‌మన్ గిల్, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇచ్చారు. రుతురాజ్ గైక్వాడ్ సైతం వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లిపోయాడు. దాంతో 13 మంది ఆటగాళ్లు మాత్రమే ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నారు.