న్యూఢిల్లీ: జెర్సీ నంబర్ 45 మహిమతోనే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 453 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 556 సిక్స్‌లతో అగ్రస్థానంలో నిలిచాడు. క్రిస్ గేల్ 483 మ్యాచ్‌ల్లో 553 సిక్స్‌లు బాదాడు. ఈ ఇద్దరి తర్వాత షాహిద్ అఫ్రిది(508 ఇన్నింగ్స్‌ల్లో 476 సిక్స్‌లు) ఉన్నాడు.

అత్యధిక సిక్స్‌లు ఘనతను అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ.. ఈ ఫీట్ సాధించినందుకు క్రిస్ గేల్ కూడా హ్యాపీగా ఉంటాడని తెలిపాడు. మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన రోహిత్ శర్మ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టినా.. ఆటలో అతన్ని ఢీకొట్టలేనని చెప్పాడు.
'యూనివర్స్ బాస్ యూనివర్స్ బాసే. అతని బుక్‌లో నుంచి నేను ఒక్క పేపర్‌ను మాత్రమే తీసుకున్నా. కొన్నేళ్లుగా గేల్ విధ్వంసాన్ని మనమంతా చూశాం. అతనో సిక్సర్లు బాదే యంత్రం. ఎక్కడ ఆడినా తన హిట్టింగ్‌తో ఆకట్టుకునేవాడు. మేం ఇద్దరం ఒకే నంబర్ జెర్సీ ధరిస్తాం. నెంబర్ 45 జెర్సీ కలిగిన నేను ఈ ఘనతను సాధించినందుకు గేల్ కచ్చితంగా సంతోషిస్తాడు.
నేను క్రికెట్ మొదలుపెట్టినప్పుడు ఈ తరహాలో సిక్స్‌లు బాదుతానని అస్సలు ఊహించలేదు. అత్యధిక సిక్స్‌ల ఘనత వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. కాబట్టి ఈ రికార్డు పట్ల నేను సంతోషంగా ఫీలవుతున్నాను.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇక రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డుపై ట్విటర్ వేదికగా స్పందించిన క్రిస్ గేల్.. అభినందనలు తెలిపాడు. ఇక ఈ ట్వీట్‌కు బదులిచ్చిన రోహిత్.. థ్యాంక్స్ చెబుతూ ఆసక్తికర కామెంట్ చేశాడు. '4, 5 మన జెర్సీలపై ఉండే నెంబర్స్.. కానీ మన ఫేవరేట్ మాత్రం 6' అని బదులిచ్చాడు.