తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటవ్వడం తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. ఓవర్‌కాస్ట్ కండీషన్స్‌లో తమను ఇబ్బంది పెట్టారని, 50 పరుగుల్లోపే ఆలౌటవుతామని అస్సలు ఊహించలేదన్నాడు.

పంత్ బ్యాటింగ్ సూపరో సూపర్..
'రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం. తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాం. 350 పరుగులు వెనుకంజలో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడానికి ఏం ఉండదు. బంతి చూసి బాదడమే. మా బ్యాటర్లు నెలకొల్పిన కొన్ని భాగస్వామ్యాలు కమ్ బ్యాక్ చేస్తామనే ఆశలు రేకెత్తించాయి.
తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైనా.. మేం పోరాడిన తీరుపట్ల గర్వపడుతున్నాం. సర్ఫరాజ్ ఖాన్, పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడూ ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా చూశారు. వాళ్లు అంతలా అద్భుతంగా ఆడారు. రిషభ్ పంత్ చాలా రిస్కీ షాట్స్ ఆడినా.. తన ఆటలో పరిణతి కనబర్చాడు. కొన్ని బాల్స్ డిఫెండ్ చేయడం.. మరికొన్ని వదిలేయడం ఇంకొన్ని షాట్స్ ఆడాడు.

ఆ తప్పిదమే..
సర్ఫరాజ్ కూడా గొప్ప పరిణతి చూపించాడు. అతను ఆడుతున్నది నాలుగో టెస్ట్ అయినా.. ఎంతో అనుభవం కలిగిన ఆటగాడిగా పరుగులు చేశాడు. ముఖ్యంగా ఎలాంటి షాట్స్ ఆడాలనే విషయంలో స్పష్టతతో కనిపించాడు. రెండో రోజు మీడియా సమావేశంలోనే ఓవర్‌కాస్ట్ కండీషన్స్ మమ్మల్ని దెబ్బతీసాయిని చెప్పాను. కానీ మేం 50 పరుగుల్లోపే ఆలౌటవుతామని అస్సలు ఊహించలేదు.
న్యూజిలాండ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. మా బ్యాటింగ్ విభాగానికి కఠిన సవాళ్లు విసిరింది. వారి సవాళ్లను తిప్పికొట్టడంలో మేం విఫలమయ్యాం. అప్పడప్పుడు ఇలాంటి ఫలితాలు ఎదురవ్వడం సాధారణమే. సానుకూలాంశాలను తీసుకొని ముందుకు సాగుతాం. జట్టులో ఉన్న ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితులు కొత్త కావు.
ఓడిపోవడం కొత్త కాదు...
ఇంగ్లండ్‌తో కూడా మేం తొలి మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాం. ఆ తర్వాత వరుసగా నాలుగు టెస్ట్‌లు గెలిచాం. ఇలానే న్యూజిలాండ్‌తో తదుపరి రెండు టెస్ట్‌లు గెలుస్తాం. అందుకోసం జట్టులోని ప్రతీ ఒక్కరు ఏం చేయాలనేది మాకు తెలుసు. మా అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చేందుకు ప్రయత్నిస్తాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.