న్యూఢిల్లీ: గాయాల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిందేనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తనతో పాటు ఎంత పెద్ద ఆటగాడైనా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయడంతో పాటు ఫామ్ కూడా కనబర్చాలన్నాడు. గాయాలతో గత నాలుగు నెలలుగా జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నారు.
జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆసియాకప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో ఈ ఇద్దరి రాక కీలకంగా మారింది. అయితే రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇంకా ఫిట్ అవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ ఆసియాకప్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరి ఫిట్‌నెస్ వ్యవహారంపై రోహిత్ శర్మ స్పందించాడు.

ముంబైలో జరిగిన ఓ ఫుట్‌బాల్ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ.. టీమిండియా సెలెక్షన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఎవరికి కూడా నేరుగా జట్టులోకి వచ్చే ఆస్కారం లేదు. నాతో సహా జట్టులో చోటు కోసం అందరు కష్టపడాల్సిందే. ఎవరైనా ఫిట్‌నెస్ నిరూపించుకొని ఫామ్ అందుకుంటేనే జట్టులోకి వస్తారు.
వన్డే ప్రపంచకప్ ముందు వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్, ఆసియా కప్ మాకు సన్నాహకంగా ఉపయోగపడనున్నాయి. కుర్రాళ్ల సత్తాను పరీక్షించేందుకు విండీస్ సిరీస్ ఉపయోగించుకున్నాం. ఆసియా కప్‌లోనూ అదే చేయబోతున్నాం. గత నాలుగు నెలలుగా శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆడలేదు.
పెద్ద సర్జరీలు చేయించుకున్నారు. సర్జరీ తర్వాత ఎంత కఠినంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. నాకు సర్జరీ చేసుకున్న అనుభవం ఉంది. వారిద్దరూ ఎలా రెస్పాండ్ అవుతారో అనేదానిపై తుది నిర్ణయం తీసుకుంటాం. మరికొద్ది రోజుల్లో సెలెక్షన్ మీటింగ్ జరగనుంది. అయ్యర్, రాహుల్ రీఎంట్రీపై సుదీర్ఘంగా చర్చిస్తాం.
నిజాయితీగా చెబుతున్నా ఎవరూ కూడా నేరుగా జట్టులోకి రాలేరు. అందరూ జట్టులో స్థానంలో కోసం పోరాడాల్సిందే. అది టాపార్డర్ అయినా.. లోయర్ ఆర్డర్ అయినా కష్టపడితేనే చోటు దక్కుతోంది. మా ముందు చాలా పేర్లు ఉన్నాయి. సరైన కాంబినేషన్ ఏదో నిర్ణయిస్తాం. ప్రపంచకప్ ముందు ఆసియాకప్‌ను వాడుకుంటాం.
ఒత్తిడిలో ఆడే బ్యాటర్లు ఎవరా? అనేది ఆసియాకప్‌తో తేల్చుకుంటాం. ఒత్తిడిలో క్వాలిటీ టీమ్స్‌తో ఎలా ఆడుతున్నారనేది నిశితంగా పరిశీలిస్తాం. మెగా టోర్నీకి ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు వేచి చూస్తాం. ఒకరిద్దరు ఆటగాళ్లు కాకుండా చాలా మంది ఆటగాళ్లు రెడీగా ఉండటం సంతోషించే విషయం. రాహుల్, అయ్యర్ గత నెలలుగా ఎన్‌సీఏలోనే ఉండి శ్రమిస్తున్నారు. వారి రీఎంట్రీ సానుకూల సూచనలే ఉన్నాయి. వారి రీఎంట్రీ కోసం ఎదురు చూస్తాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.