
దుబాయ్: ఆసియాకప్ 2022లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. జట్టులో ఒకే ఒక మార్పు చేసామని బాబర్ ఆజామ్ తెలిపాడు.
గాయంతో షానవాజ్ దూరమవ్వగా అతని స్థానంలో హసన్ అలీ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అనేక సానుకూలంశాలు తమకు లభించాయని, విజయం కోసం తమ శక్తి మేరుకు పోరాడుతామని తెలిపాడు.
టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగ్ ఎంచుకునేవాడినన టీమిండియా సారథి రోహిత్ శర్మ తెలిపాడు. అయితే దీనికి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని, స్వేచ్చగా ఆడుతూ ఈ వికెట్‌పై చేయాల్సిన బెస్ట్ స్కోర్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇలాంటి బిగ్ టోర్నీల్లో వరుస విజయాలు కీలక పాత్ర పోషిస్తాయని, జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నాడు. ఈ మ్యాచ్ గురించి దాయాదుల పోరు అంటూ బయట జరుగుతున్న చర్చను ఏ మాత్రం పట్టించుకోమని తెలిపాడు. ఇక జడేజా గాయపడటంతో తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారిందన్న రోహిత్.. జట్టులో మూడు మార్పులు చేసామన్నాడు. హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇవ్వగా.. దీపక్ హుడా, రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చారని తెలిపాడు. తప్పని పరిస్థితుల్లోనే ఈ మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు.
ఊహించినట్లుగానే దినేశ్ కార్తీక్, ఆవేశ్ ఖాన్‌లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. కార్తీక్ స్థానంలో పంత్ జట్టులోకి రాగా.. ఆవేశ్ ఖాన్ ప్లేస్‌లో రవి బిష్ణోయ్‌కి అవకాశం దక్కింది. గాయంతో దూరమైన జడేజా స్థానాన్ని దీపక్ హుడాతో భర్తీ చేశారు. లెఫ్టాండర్ బ్యాటర్ కోసమే దినేశ్ కార్తీక్‌ను కాదని రిషభ్ పంత్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
పాక్‌తో తొలి పోరులో కష్టంగా గట్టెక్కిన ఇండియా.. కసి మీదున్న ఆ జట్టును మరోసారి ఓడించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. గాయం వల్ల స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సేవలు కోల్పోయిన రోహిత్‌సేన టాపార్డర్ తడబాటు, అనుభవం లేని పేస్ బౌలింగ్ ఎటాక్‌తో కాస్త ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో ఇండియా చేతిలో ఓటమి నుంచి తేరుకొని హాంకాంగ్‌పై 155 రన్స్ తేడాతో రికార్డు విక్టరీ సాధించిన పాక్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. కాబట్టి రోహిత్‌సేన ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, భువనేశ్వర్, అర్ష్‌దీప్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్.
పాకిస్తాన్: బాబర్(కెప్టెన్), రిజ్వాన్ (కీపర్), జమాన్, ఇఫ్తికర్, కుష్దిల్, షాదాబ్, ఆసిఫ్, నవాజ్, నసీమ్, రవూఫ్, హసన్ అలీ