బౌలింగ్ బాగా చేసినా.. బాధ్యతలేని బ్యాటింగ్ కొంపముంచింది: రోహిత్ శర్మ

ముంబై: నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లను ఇచ్చుకోవడంతోనే లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలయ్యామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బౌలింగ్ బాగా చేసినా.. బాధ్యతలేని బ్యాటింగ్ కొంపముంచిందన్నాడు. లక్ష్యచేధనకు దిగినప్పుడు భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా ముఖ్యమని, కానీ తమ బ్యాటర్లు ఆ పనిచేయలేకపోయారన్నాడు. లక్నోతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో ముంబై 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇది ముంబైకి వరుసగా 8వ ఓటమికాగా.. ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఫలితంగా ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి రోహిత్ సేన అధికారికంగా తప్పుకుంది.

బాధ్యతలేని బ్యాటింగ్..
మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ టీమ్ ఆట తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదన్నాడు. 'ఈ మ్యాచ్‌లో మేం అద్భుతంగా బౌలింగ్ చేసాం. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడం సులువైన పనికాదు. ఈ లక్ష్యం చేధించదగినదే. కానీ మేం బ్యాట్‌తో రాణించలేకపోయాం. లక్ష్యాలను చేధించేటప్పుడు భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా ముఖ్యం. కానీ నాతో సహా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. దాంతో మూమెంటమ్‌ను అందుకోలేకపోయాం.

ఒక్కడైనా లాంగ్ ఇన్నింగ్స్..
లక్నో అద్భుతంగా బౌలింగ్ చేసింది. మేం ఈ టోర్నీలో స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేదు. మిడిలార్డర్‌లో ఆడే ఆటగాళ్లు బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ చివరి వరకు ఆడటం ముఖ్యం. ప్రత్యర్థి ఆటగాళ్లలో కొంతమంది ప్లేయర్లు ఇది చేశారు. కానీ మేం అది చేయలేకపోవడం తీవ్ర బాధకు గురి చేసింది. కనీసం ఒక్కడైన సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయాల్సింది. మేం సరైన కాంబినేషన్ కోసం ఆటగాళ్లకు చాలా అవకాశాలు ఇచ్చాం. ఇక తమ దేశాలు తరఫున ఆడేటప్పుడు వేరే రోల్స్‌లో ఆడిన ఆటగాళ్ల నుంచి మేం చాలా ఆశించాం.

మార్పులు చేయకుండా..
జట్టులో భారీ మార్పులు చేయకుండా సాధ్యమైనంతవరకు బెస్ట్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగాం. కానీ వరుస పరాజయాలు ఎదురైనప్పుడు అందరూ టీమ్ కాంబినేషన్‌నే తప్పుబడుతారు. నేను మాత్రం ఆటగాళ్లు తమను తాము నిరుపించుకునేవరకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలనుకున్నాను. ఈ సీజన్ మేం కోరుకున్న విధంగా సాగలేదు.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

రాహుల్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(62 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 103 నాటౌట్) సెంచరీతో చెలరేగగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో రిలే మెరిడిత్, కీరన్ పొలార్డ్ రెండు వికెట్లు తీయగా.. డానియల్ సామ్స్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసారు.
రోహిత్ శర్మ(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 39), తిలక్ వర్మ(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీయగా.. మోహ్‌సిన్ ఖాన్, జాసన్ హోల్డర్, రవి బిష్ణోయ్, ఆయుష్ బదోని తలో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications