న్యూఢిల్లీ: తాను రికార్డుల కోసం ఆడనని, గణంకాల కంటే ఆటను ఆస్వాదించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆటలో అనుభూతులను వెతుక్కుంటానని తెలిపిన రోహిత్ శర్మ... ఎన్ని పరుగులు చేశా?.. ఎన్ని మ్యాచ్‌లు ఆడాననే విషయాన్ని అస్సలు పట్టించుకోనని చెప్పాడు.
ఆసియాకప్ 2023 నేపథ్యంలో పీటీఐతో మాట్లాడిన హిట్ మ్యాన్.. టీమ్ కాంబినేషన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నేనెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదు. ప్రత్యేకంగా నిలవాలని కూడా కోరుకోలేదు. అది జనాల చేతుల్లోనే ఉంటుంది. నేను గణంకాల కంటే ఆటను ఆస్వాదించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను.

ఆడిన ప్రతీ మ్యాచ్, ప్రతీ మూమెంట్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటా. నా సంతోషం కోసమే ఆడుతా. ఆడినంత కాలం మధురానుభూతులను సంపాదించుకోవడంపై ఫోకస్ పెడుతా. నా సహచర ఆటగాళ్లతో నాకు మంచి అనుబంధం ఉండాలని కోరుకుంటా. ఎన్ని పరుగులు చేశా.. ఎన్ని మ్యాచ్‌లు ఆడా? అనే లెక్కలు నాకు అవసరం లేదు.
ఏ టోర్నీ గెలవాలన్నా టీమ్ కాంబినేషన్ చాలా ముఖ్యమని మాకు కూడా తెలుసు. అయితే ప్లేయర్లు వరుసగా గాయపడుతూ ఉంటే.. ఒకే జట్టును కొనసాగించలేం. అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో ఒకే జట్టును కొనసాగించేందుకు నేను, రాహుల్ భాయ్ చాలా ప్రయత్నించాం. ప్రతీ సిరీస్‌కు జట్టును ప్రకటించినప్పుడు సెలెక్టర్లతో ఆటగాళ్లతో మాకేం కావాలో చర్చించాం.
జట్టుకు ఎంపిక కానీ ఆటగాళ్లతో కూడా మాట్లాడి భరోసా కల్పించాం. కొన్నిసార్లు జట్టు కంటే ఏదీ ముఖ్యం కాదు. అలాంటప్పుడు కొందరు కొన్ని త్యాగాలు చేయక తప్పదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఆసియాకప్ 2023 టోర్నీ బుధవారం ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. సెప్టెంబర్ 2 జరిగే మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీ ముగిసిన అనంతరం అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. మెగా టోర్నీకి ముందు ఆసియాకప్‌ను ఆయా జట్లు ప్రిపరేషన్‌గా వాడుకోవాలనుకుంటున్నాయి.