Rohit Sharma: మా విజయానికి కారణం అదే!

రాంచీ: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో సమష్టిగా రాణించడంతోనే విజయాన్నందుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రతీకూల పరిస్థితుల మధ్య తమ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని తెలిపాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. సహచర ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ముఖ్యంగా రిజర్వ్ బెంచ్ క్వాలిటీ అద్భుతమన్నాడు. కీలక సమయంలో రాణించి మ్యాచ్‌పై పట్టు సాధించామని చెప్పాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ సామర్థ్యం తమకు తెలుసుని, దానికి అనుగుణంగానే ప్రణాళికలు రచించి ఫలితాలను రాబట్టామన్నాడు. హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. కివీస్ ఓపెనర్ల ధాటైన ఇన్నింగ్స్‌తో బౌలర్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా ఒక్క వికెట్ తీస్తే చాలని వారిని తరుచూ ఉత్సాహపరిచానని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఒక్క వికెట్ చాలు..
'జట్టు మొత్తం అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఇది సమష్టి విజయం. పరిస్థితులు కఠినంగా ఉన్నా మేం గొప్ప ప్రదర్శన చేశాం. ప్రత్యర్థి బ్యాటింగ్ సామర్థ్యం తెలుసు. వారు అద్భుతమైన షాట్లు ఆడారు. ముఖ్యంగా ఆరంభంలో ధాటిగా ఆడుతూ మా బౌలర్లపై విరుచుకుపడ్డారు.
మా బౌలర్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా తరుచూ వారికి ఒక్కటే చెప్పా.. ఒక్క వికెట్ తీస్తే చాలు. గేమ్‌లో నిలవచ్చన్నా. అలానే అద్భుతంగా పోరాడి న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేశాం. ఇక భారత రిజర్వ్ బెంచ్ చాలా బలంగా ఉంది. ఏవరూ అవకాశం అందుకున్నా నిలకడగా రాణిస్తున్నారు. యువ ఆటగాళ్లకు స్వేచ్చగా ఆడేలా చూడటం నా బాధ్యత.

హర్షల్ సూపర్..
ఇదో యంగ్ టీమ్. కుర్రాళ్లకు ఎక్కువగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. కాబట్టి వాళ్లు మిడిల్ ఓవర్లలో ఎక్కువసేపు ఆడటం చాలా ముఖ్యం. ఇక తదుపరి మ్యాచ్‌లో బరిలోకి దిగే తుది జట్టు మార్పులు గురించి ఇప్పుడే మాట్లాడటం మరీ తొందరవుతుంది. టీమిండియా విజయానికి కలిసొచ్చే పనులనే మేం చేస్తాం. జట్టులో ఉండి ఎక్కువగా అవకాశం రాని ఆటగాళ్లు ఎవరో గుర్తించాల్సిన అవసరం ఉంది.
చాలా మందికి పెద్దగా అవకాశం రాలేదు. వారందరికి చాన్సిస్తాం. చాలా టీ20 మ్యాచ్‌లున్నాయి. అందర్ని ఆడించే ప్రయత్నం చేస్తాం. హర్షల్ పటేల్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడు. అతనో అసాధారణమైన బౌలర్. ఈ కఠిన పరిస్థితుల్లో కూడా అతను స్లోయర్ బాల్స్‌ను అద్భుతంగా వేసాడు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

సూపర్ బౌలింగ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. కివీస్ బ్యాటింగ్‌లో మార్టిన్ గప్టిల్(31), డారిల్ మిచెల్(31), గ్లేన్ ఫిలిప్స్(34) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. కివీస్ ఓపెనర్ల ధాటైన ఇన్నింగ్స్‌తో ఓ దశలో 190+ రన్స్ చేస్తుందనుకున్న న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా హర్షల్ పటేల్, స్పిన్నర్లు అదరగొట్టారు.

రోహిత్, రాహుల్ హాఫ్ సెంచరీ..
అనంతరం భారత్ 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 155 రన్స్ చేసి మరో 16 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. భారత బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్(49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65), రోహిత్ శర్మ(36 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా.. వెంకటేశ్ అయ్యర్(11 బంతుల్లో 2 ఫోర్లతో 12 నాటౌట్), రిషభ్ పంత్(6 బంతుల్లో 2 సిక్స్‌లతో 12 నాటౌట్) తమదైన శైలిలో మ్యాచ్‌ను ముగించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. ఇతర బౌలర్లు విఫలమయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications