
ముంబై: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ప్రతీ క్షణం ఆస్వాదించానని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అతని నాయకత్వంలోనే ఓ ఆటగాడిగా ఎదిగానని చెప్పుకొచ్చాడు. కోహ్లీ సారథ్యంలో భారత జట్టు గొప్ప విజయాలందుకుందని తెలిపాడు. సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలిగించి రోహిత్ శర్మకు అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కెప్టెన్సీ మార్పు సర్వత్రా చర్చనీయాంశమైంది. యావత్ క్రికెట్ ప్రపంచం రెండుగా విడిపోయింది. కొందరూ విరాట్ కోహ్లీకి అండగా నిలుస్తుంటే.. మరికొందూ రోహిత్ శర్మకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
ఇక వన్డే కెప్టెన్‌గా బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతని కెప్టెన్సీని గొప్పగా వర్ణించాడు. 'విరాట్ కోహ్లీతో అద్భుతమైన సమయాన్ని గడిపాను. అతని కెప్టెన్సీలోని ప్రతీక్షణాన్ని ఆస్వాదించాను. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. భారత జట్టును ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నంతకాలం జట్టు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ప్రతి మ్యాచ్‌లో టీమ్ గెలవాలన్న పట్టుదలను ప్లేయర్స్‌లో పెంచాడు. ఆటగాళ్లంతా విరాట్ కెప్టెన్సీని ఎంజాయ్ చేశారు. ఇక ముందు కూడా అది అలానే కొనసాగుతుంది.
భారత జట్టుకు ఆడేటప్పుడు ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక సారథ్యం అంటే మామూలు విషయం కాదు. క్రికెట్ అభిమానులు మనలోని పాజిటివ్‌లు, నెగిటివ్‌ల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే క్రీడాకారుడిగా నాకు మాత్రం ఆట మీద దృష్టిసారించడమే ముఖ్యం. ప్రజలు ఏం మాట్లాడుకుంటారనే దానిని ఎవరూ ఆపలేరు. జట్టుకు అవసరమైనప్పుడు నా భాగస్వామ్యం తప్పకుండా ఇస్తా. అలానే భారీ టోర్నమెంట్లలో ఆడేటప్పుడు మిగతా జట్టు సభ్యులు కూడా అర్థం చేసుకుని రాణించేందుకు ప్రయత్నిస్తారు. 'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రోహిత్ శర్మ తెలిపాడు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేయడం అత్యద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. 'రాహుల్ భాయ్‌తో పనిచేయడం... అంటే... మూడు మ్యాచ్‌లే అయి ఉండవచ్చు.. అయినా ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. ఆయన ఆట ఎలా ఉంటుందో మనం చూశాం. హార్డ్‌వర్కర్. అదే సమయంలో ఆయన డ్రెస్సింగ్ రూంలో ఉన్నారంటే ఉల్లాసభరిత వాతావరణం ఉంటుంది. మెరుగ్గా రాణించాలంటే కచ్చితంగా ఇలాంటి వాతావరణం ఉండాలి కదా మరి! భాయ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది'' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.