Rohit Sharma, IND vs NZ: తన దగ్గర మంత్రం ఏం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. జట్టులో ప్రతీ ఆటగాడికి అండగా నిలవడంతోనే వరుస విజయాలు దక్కాయని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీఫైనల్లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన కెప్టెన్సీపై ప్రశ్నించగా.. రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'నా దగ్గర మంత్రం ఏం లేదు. ఓ కెప్టెన్‌గా జట్టు విజయం కోసం ఎలా ఆడాలనేదానిపై క్లారిటీ ఉండాలి. అందుకు కావాల్సిన ఆటగాళ్లకు అండగా నిలవాలి. ఈ టోర్నీలో మేం అదే చేశాం. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే ఆటగాళ్లకు అండగా నిలిచాం.

క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు నాకు ముఖ్యమే. ఎందుకంటే దేశానికి ప్రాతినిథ్యం ఇస్తున్నప్పుడు ప్రతీ ఫార్మాట్ కీలకమే. నా దృష్టిలో ప్రపంచకప్ అన్నిటి కంటే చాలా ముఖ్యం. న్యూజిలాండ్ చాలా క్రమశిక్షణ కలిగిన జట్టు. చాలా తెలివైన క్రికెట్ ఆడుతోంది. ప్రత్యర్థి మైండ్‌సెట్‌ను పసిగడుతోంది. మేం కూడా వారిలానే అర్థం చేసుకుంటాం.
ప్రస్తుతం నా ఫోకస్ అంతా తదుపరి గేమ్ గెలవడంపైనే ఉంది. అంతే తప్పా.. నా క్రికెట్ జర్నీపై కాదు. బహుషా ఈ టోర్నీ ముగిసిన అనంతరం నా క్రికెట్ ప్రయాణం గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం అయితే జట్టు కోసం ఏం చేయాలనేదానిపైనే దృష్టి పెట్టాను.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
'తొలి గేమ్ నుంచి చివరి వరకు.. ఎక్కడ ప్రపంచకప్ మ్యాచ్ ఆడినా ఒత్తిడి ఉండటం సహజం. కానీ మేం ఒత్తిడిని అద్భుతంగా హ్యాండిల్ చేశాం. అదే జోరును నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నాం. భారత్‌లో ఎప్పుడు మ్యాచ్ ఆడినా ఒత్తిడి ఉంటుంది. మేం మా మ్యాచ్‌పైనే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాం.'అని ఒత్తిడి గురించి అడిగిన ప్రశ్నకు రోహిత్ బదులిచ్చాడు.
ఆరో బౌలింగ్ ఆప్షన్‌పై స్పందిస్తూ.. 'హార్దిక్ పాండ్యా గాయపడటంతో టీమ్ కాంబినేషన్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది. తొలి గేమ్ నుంచి మా బౌలర్లు సత్తా చాటారు. బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం చాలా మంచిది. కానీ ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉపయోగించుకునే పరిస్థితి మాకు రాలేదు. తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఆరో బౌలింగ్ ఆప్షన్ అవసరం రాదనే కోరుకుంటున్నా.'అని రోహిత్ బదులిచ్చాడు.