కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాపై విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సోమవారం జరిగిన తమ చివరి సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది.
ఈ విజయంతో గ్రూప్-1 టాపర్‌గా టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా మాత్రం తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇతర జట్ల జయాపజయాలపై ఆసీస్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కీలక వికెట్లు తీసి తమ విజయానికి బాటలు వేసాడని చెప్పాడు. 'ఈ విజయం సంతృప్తినిచ్చింది. ఎందుకంటే ఆసీస్ జట్టు ఎంత బలమైనదో.. ప్రతికూల పరిస్థితుల్లో ఎలా పుంజుకుంటుందో మాకు బాగా తెలుసు. అంతకుమించి ఈ మ్యాచ్‌లో మేం జట్టుగా రాణించి విజయం సాధించాం.
ఈ గెలుపు మా జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. 200 పరుగుల లక్ష్యం మంచి స్కోరే. కానీ ఇక్కడ ఎప్పుడు ఆడినా బలమైన గాలుల ప్రభావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగవచ్చు. కానీ ఈ పరిస్థితులను మేం అద్భుతంగా అందిపుచ్చుకున్నాం. సరైన సమయంలో వికెట్లు తీయగలిగాం.
కుల్దీప్ యాదవ్ బలం గురించి మాకు తెలుసు. కానీ అతని అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకోవడం ముఖ్యం. న్యూయార్క్‌లో పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉన్నాయి. దాంతో అతన్ని ఆడించలేదు. కానీ ఇక్కడ అతని అవసరం ఉందని భావించి అవకాశం ఇచ్చాం. అందుకు తగ్గట్లుగానే కుల్దీప్ సత్తా చాటాడు.
సెమీఫైనల్లోనూ ఇలానే ఆడుతాం. పరిస్థితులకు తగ్గట్లు రాణిస్తాం. అతిగా ఆలోచించకుండా స్వేచ్చగా ఆడే ప్రయత్నం చేస్తాం. ప్రత్యర్థి ఎవరా? అని కూడా చూడం. నిలకడైన ప్రదర్శనను కొనసాగించే ప్రయత్నం చేస్తాం. జట్టుగా మాలో ఎలాంటి మార్పు ఉండదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలనే ప్లాన్‌తో బ్యాటింగ్ చేసానని రోహిత్ శర్మ తెలిపాడు. తాను ఒకే టెంపోతో బ్యాటింగ్ చేయాలనుకున్నానని, దాంతోనే సెంచరీ గురించి ఆలోచించలేదని వివరణ ఇచ్చాడు. తాను హాఫ్ సెంచరీలు, సెంచరీలకు అంతగా విలువ ఇవ్వనని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ(41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 92), సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(2/45), మార్కస్ స్టోయినీస్(2/56) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓటమిపాలైంది. ట్రావిస్ హెడ్(43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/37) మూడేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.