కొలంబో: మైదాన సిబ్బంది వల్లే పాకిస్థాన్‌పై విజయం దక్కిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో రెండు రోజుల పాటు జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పదే పదే వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ చివరకు పూర్తిగా సాగింది.
ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. గ్రౌండ్స్‌మెన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. వారు తీవ్రంగా కష్టపడటంతోనే మ్యాచ్ సాధ్యమైందని తెలిపాడు. 'మేం క్రీజులో ఎక్కువ సేపు గడపాలని భావించాం. అనుకున్నట్లుగానే టైమ్ తీస్కోని చెలరేగాం. చాలా మంది ఆటగాళ్లు ఇలా చేయరు. ఈ మ్యాచ్ జరగడానికి గ్రౌండ్స్‌మెన్ ప్రధాన కారణం. కవర్లు కప్పుతూ.. తీయడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు.

రెండు రోజుల పాటు మైదాన సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారు. మా జట్టు తరఫున వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకరకంగా వారి కష్టం వల్లే మాకు ఈ విజయం దక్కింది. మా బ్యాటింగ్ విభాగం దుమ్మురేపింది. మ్యాచ్ ఆరంభం నుంచే పాక్ బౌలర్లను చెలరేగింది. ఓపెనర్లుగా మేం అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తే.. అనుభవం కలిగిన కోహ్లీ, రాహుల్ భారీ ఇన్నింగ్స్ ఆడారు. వర్ష ప్రభావానికి తగ్గట్లు లెక్కలు వేసుకొని బ్యాటింగ్ చేశారు.
జస్‌ప్రీత్ బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేశాడు. గత 8-10 నెలలుగా అతను తీవ్రంగా కష్టపడ్డాడు. 27 ఏళ్ల బుమ్రా తరుచూ జట్టుకు దూరమవ్వడం ఏ మాత్రం మంచిది కాదు. ఈ మ్యాచ్‌లో మేం ఎలా బ్యాటింగ్ చేయాలనుకున్నామో అలానే చేశాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్ చేశాడు.
కేఎల్ రాహుల్ సైతం తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి 5 నిమిషాల ముందు జట్టులోకి వచ్చి ఇలా సెంచరీతో చెలరేగడం అద్భుతం.'అని రోహిత్ శర్మ కొనియాడాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 111 నాటౌట్), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 10 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 32 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు చేసి ఓటమికి అంగీకరించింది. నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ గాయపడటంతో బ్యాటింగ్‌కు రాలేదు. దాంతో భారత్ విజయం లాంఛనమైంది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(5/25) ఐదు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.