ఆ బేఖార్ మాటలను అంగీకరించను.. ప్రపంచకప్‌కు ప్రతీ ఒక్కరిని సిద్దం చేస్తాం: రోహిత్ శర్మ

పోర్ట్‌ఆఫ్ స్పెయిన్: గత ప్రపంచకప్ వైఫల్యాన్ని ఉద్దేశించి బయట వ్యక్తుల చేసే విమర్శలను ఏ మాత్రం అంగీకరించనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. జట్టు ఫలితాలపై స్పందించేటప్పుడు కాస్త సంయమనం పాటించాలని విమర్శకులకు రోహిత్ సూచించాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నేడు(శుక్రవారం) జరగనున్న నేపథ్యంలో రోహిత్ మీడియాతో మాట్లాడాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు వరకు టీమిండియా సంప్రదాయ పద్ధతిలో క్రికెట్ ఆడిందని, అందుకే ఓటమిపాలైందనే విమర్శలను రోహిత్ కొట్టిపారేసాడు. యువ ఆటగాళ్లకు మరింత స్వేచ్చగా ఆడేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పిన రోహిత్.. టీ20 ప్రపంచకప్ వరకు అందరిని తాజాగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు.

ఆ మాటలను అంగీకరించను..
'గత ప్రపంచకప్‌లో సరైన ఫలితాలను సాధించలేకపోయాం. అంత మాత్రానా మేము సరిగ్గా ఆడలేదని కాదు. అదేవిధంగా సంప్రదాయబద్ధంగా ఆడటం వల్లే ఓటమిపాలైందని బయట వచ్చిన విమర్శలను అంగీకరించను. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఒకటి రెండు మ్యాచ్‌లు ఓడితే చాలు ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవు. సంప్రదాయంగానే ఆడామని అనుకుందాం... మేం గత ప్రపంచకప్ ముందు వరకు ఆడిన మ్యాచుల్లో దాదాపు 80 శాతం గెలిచాం. ఈ విధంగా మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత్ సంప్రదాయపద్ధతిలోనే ఆడిందని ఎలా చెబుతున్నారో అర్థం కావడంలేదు. మేం ప్రపంచకప్‌లో ఓడిపోయాం. అది జరిగిపోయింది. అలాగని మా జట్టు సభ్యులు స్వేచ్ఛగా ఆడలేదని కాదు.

విమర్శకులు మారాలి..
ఇటీవల టీమ్ అంతా ఏదో పూర్తిగా మార్చినట్లు చెబుతున్నారు. కానీ మా ఆటగాళ్లకు మరింత స్వేచ్ఛ ఇచ్చాం. అందుకే అద్భుత ప్రదర్శన బయటికొస్తోంది. అయితే బయటి వ్యక్తులు కాస్త సంయమనం పాటించాలి. మేం ఆడే విధానంతో కొన్నిసార్లు పరాజయాలు వస్తాయి. అనుకున్న విధంగా ఫలితాలు ఉండకపోవచ్చు. అయితే ఎప్పుడూ విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయేమో కానీ.. ఆటగాళ్లు సరిగా ఆడనట్లు కాదు. ప్రతి ఒక్కరూ ఏదొక సమయంలో మారాలి. ఇప్పుడు మేం మారుతూ వస్తున్నాం. విమర్శలు చేసేవారు కూడా మారాల్సిన అవసరం ఉంది'' అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

ఆటగాళ్లు స్వేచ్చగా ఆడేలా చేయడమే..
ప్రపంచకప్ కోసం బరిలోకి దిగే జట్టులో భర్తీ చేయాల్సిన స్థానాలు ఉన్నాయా? ఎలా భర్తీ చేస్తారనే ప్రశ్నకు రోహిత్ సమాధానం ఇచ్చాడు. 'ప్రపంచకప్ టీమ్‌లో కొన్ని స్థానాలను ఆటగాళ్లతో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటి ప్లేయర్లు ఎవరనేది మాకు తెలుసు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం కోసం రాబోయే ప్రతి మ్యాచ్‌ను వినియోగించుకుంటాం. మా యువ ఆటగాళ్లకు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఇస్తున్నాం. ఇప్పటికే సన్నద్ధత, టెక్నిక్‌కు సంబంధించిన విషయాలను వారికి వివరించాం. మ్యాచ్‌లో మాత్రం వారు ఎలా ఆడాలని భావిస్తున్నారో అదే విధంగా ఆడాలని సూచించాం. ఆటగాళ్లలో ఉన్న ఒత్తిడిని తరిమేయడమే మా బాధ్యత. స్వేచ్ఛగా ఆడేందుకు అవసరమైన పరిస్థితులను వారికి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.

ఫ్రెషగా ఉండేలా జాగ్రత్తలు..
అలానే ప్రతి ఒక్కరూ ప్రపంచకప్ నాటికి తాజాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన వారికి విశ్రాంతినిస్తున్నాం. అయితే వరల్డ్‌కప్ సమయానికి సిద్ధంగా ఉంచేలా చూస్తున్నాం. విండీస్‌తో సిరీస్‌లు ఆడని వారికి వచ్చే మ్యాచుల్లో అవకాశం కల్పిస్తాం. మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన కోచ్ ప్యాడీ ఆప్టన్. ఆయన ఉండటం జట్టుకు, ఆటగాళ్లకు ఎంతో ప్రయోజనకరం'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. విండీస్ పర్యటన అనంతరం జింబాబ్వేతో భారత్ మూడు వన్డేలను ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్ కోసం బరిలోకి దిగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications