కొలంబో: బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనే ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని చెప్పాడు.
శుభ్‌మన్ గిల్ మాత్రం అసాధారణంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. 'వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో మా బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకున్నాం. అయితే ఈ మ్యాచ్‌లో మేం ఆడిన విధానానికి ఏ మాత్రం రాజీపడటం లేదు. ప్రపంచకప్ ఆడబోయే ఆటగాళ్లకు గేమ్ టైమ్ ఇవ్వాలనుకున్నాం. అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ విజయాన్ని అందించలేకపోయాడు.

తన పోరాటాన్ని మాత్రం కనబర్చాడు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. శుభ్‌మన్ గిల్ సెంచరీ మాత్రం అద్భుతం. అతని ఆటను మళ్లీ అందుకున్నాడు. అతనికి ఎలా ఆడాలో బాగా తెలుసు. జట్టు కోసం తన బాధ్యత ఏంటో దానిపై గిల్‌కు స్పష్టత ఉంది. గతేడాదిగా అతని ఫామ్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా కొత్త బంతితో అద్భుతంగా ఆడుతున్నాడు.
ఇందుకోసం అతను ఎంతో కష్టపడ్డాడు. సెంచరీ చేసినా శుభ్‌మన్ గిల్‌కు ఆప్షనల్ ప్రాక్టీస్ లేదు. ఫైనల్ కోసం ప్రాక్టీస్ చేయాల్సిందే'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్(85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80), టౌహిడ్ హృదయ్(81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో నసుమ్ అహ్మద్(44), మెహ్‌దీ హసన్(29 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్(3/65) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(2/35) రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా నిర్ణీత 49.5 ఓవర్లలో 249 పరుగులకు కుప్పకూలింది. శుభ్‌మన్ గిల్(133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 121) సెంచరీ పోరాటం వృథా అయ్యింది. అతనికి తోడుగా అక్షర్ పటేల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42)ఒక్కడే రాణించాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/50) మూడు వికెట్లు తీయగా.. తంజిమ్ హసన్ షకీబ్(2/27), మెహ్‌దీ హసన్(2/50) రెండేసి వికెట్లు పడగొట్టారు. షకీబ్ అల్ హసన్, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.