ఆస్ట్రేలియా టెయిలండర్స్ నాథన్ లయన్, స్కాట్ బోలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌కు జోడించిన 61 పరుగుల భాగస్వామ్యమే తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా సోమవారం ముగిసిన నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 184 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. కఠిన పరిస్థితులు ఎదురైనా.. చివరి వరకు తమ జట్టు పోరాడిందని చెప్పాడు. జస్‌ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు.

అవకాశాలను చేజార్చుకున్నాం..
'ఈ ఓటమి తీవ్రంగా నిరాశపర్చింది. ఏది ఏమైనా చివరి వరకు పోరాడాలనే ఉద్దేశంతో బరిలోకి దిగాం. దురదృష్టవశాత్తు పోరాడలేకపోయాం. చివరి రెండు సెషన్లను అంచనా వేయడం కష్టం. కానీ ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పుంజుకునే అవకాశాలు మాకు వచ్చాయి. కానీ మేం అందింపుచ్చుకోలేకపోయాం.
ఓ దశలో ఆస్ట్రేలియాను 90/6కే పరిమితం చేశాం. పరిస్థితులు కఠినంగా ఉంటాయని మాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లోనే కఠినమైన క్రికెట్ ఆడాలనుకున్నాం. ఈ మ్యాచ్ ఓటమికి ఏ ఒక్క సందర్బాన్నో నిందించాలనుకోవడం లేదు. మా నుంచి సరైన ప్రదర్శన రాలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి జట్టుగా ఎక్కడ విఫలమయ్యామో తెలుసుకుంటాం.

ఆ భాగస్వామ్యం కొంపముంచింది..
కానీ ఈ మ్యాచ్‌లో మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. కానీ ఆసీస్ మా కంటే అద్భుతంగా పోరాడింది. ముఖ్యంగా చివరి వికెట్ భాగస్వామ్యం మా ఓటమిని శాసించింది. 340 పరుగుల లక్ష్యం అంత సులువైన పని కాదని మాకు తెలుసు. కానీ మేం ఫ్లాట్ ఫామ్ సెట్ చేసి వికెట్లు చేతులో ఉండగా చివరి రెండు సెషన్లలో గెలుపు కోసం ప్రయత్నిద్దామనుకున్నాం. కానీ ఆసీస్ అద్భుతంగా బౌలింగ్ చేసింది.
లక్ష్యాన్ని చేధించాలనే అనుకున్నాం. కానీ మాకు సరైన ఆరంభం లభించలేదు. మ్యాచ్ గెలిచే విషయంలో మేం వెనకబడ్డాం. నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడికి తొలిసారి వచ్చాడు. ఇక్కడి పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. అయినా అతను అద్భుతంగా ఆడాడు. అతనిలో అసాధారణమైన టెక్నిక్ ఉంది. ఈ స్థాయి క్రికెట్‌లో రాణించే సత్తా అతనికి ఉంది.
పాపం బుమ్రా..
భవిష్యత్తులో అతను మరింత మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నా. టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి కూడా అతనికి మద్దతు ఉంటుంది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతన్ని కొన్నేళ్లుగా మేం చూస్తున్నాం. అతను గణంకాల కోసం కాకుండా జట్టు విజయం కోసం ఆడుతాడు. దురదృష్టవశాత్తు అతనికి ఇతరుల నుంచి సహకారం లభించలేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
భారత్ 155 ఆలౌట్..
340 పరుగుల భారీ లక్ష్యచేధనకు బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులకు కుప్పకూలింది. యశస్వి జైస్వాల్(208 బంతుల్లో 8 ఫోర్లతో 84) ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
ప్యాట్ కమిన్స్(3/28), స్కాట్ బోలాండ్(3/39) మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది.