
కోల్‌కతా: టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ.. సహచర ఆటగాడైన దీపక్ చాహర్‌కు సెల్యూట్ చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో దీపక్ చాహర్ బ్యాట్‌తోనూ అదరగొట్టాడు. అనూహ్యంగా పవర్ హిట్టర్ అవతారమెత్తిన దీపక్ చాహర్.. న్యూజిలాండ్ బౌలర్ ఆడమ్ మిల్నే వేసిన ఆఖరి ఓవర్‌ను దంచికొట్టాడు. 8 బంతుల్లోనే 2 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 21 పరుగులు బాది.. ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. దీపక్ చాహర్ ధనాధన్ ఆటతీరుతో భారత్ భారీ స్కోరును అందుకుంది.
ఆఖరి ఓవర్ నాలుగో బంతిని మిల్నే షార్ట్ బాల్‌గా వేయగా.. దీపక్ తన భుజ బలంతో భారీ సిక్సర్ బాదాడు. ఈ 95 మీటర్ల భారీ సిక్స్‌కు ఫిదా అయిన కెప్టెన్ రోహిత్ శర్మ డగౌట్ నుంచే మిల్నేను అభినందించాడు. అంతటితో ఆగకుండా 'సూపర్ షాట్ మామ'అంటూ దీపక్ చాహర్‌కు సెల్యూట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఓ మోస్తారు స్కోర్‌కే పరిమితమవుతుందనుకున్న భారత్‌కు దీపక్ చాహర్ తన విధ్వసంతో ఆఖరి ఓవర్‌లో 19 రన్స్ చేసి భారీ స్కోర్ అందించడంతో రోహిత్ తెగ సంతోషపడ్డాడు. ఆ క్రమంలోనే అతన్ని అభినందిస్తూ సెల్యూట్ చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 73 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ శర్మ బృందం 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' కెప్టెన్ రోహిత్ శర్మ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 29; 6 ఫోర్లు) మెరిశారు. చివర్లో దీపక్ చహర్ (8 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆటతీరుతో భారత్ భారీ స్కోరు ను అందుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ గప్టిల్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మిగిలినవారు విఫలమయ్యారు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అక్షర్ పటేల్ (3/9), హర్షల్ పటేల్ (2/26) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. న్యూజిలాండ్ తాత్కాలిక సారథి సౌతీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్‌లో సాన్‌ట్నర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు.
రెండు జట్ల మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈనెల 25న కాన్పూర్‌లో మొదలవుతుంది. డిసెంబరు 3- 7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరుగనుంది. ఇక ఈ సిరీస్ నుంచి టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్ విశ్రాంతి తీసుకోగా.. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. దాంతో ఫస్ట్ మ్యాచ్‌లో అజింక్యా రహానే భారత జట్టును నడిపించనుండగా.. పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్లుగా వృద్దీమాన్ సాహా, తెలుగు క్రికెట్ కేఎస్ భరత్‌లు చోటు దక్కించుకున్నారు.