ప్రజ్ఞాన్ ఓజా కామెంట్రీ చెబుతున్నాడా?.. వామ్మో: రోహిత్ శర్మ

పోర్ట్‌ఆఫ్ స్పెయిన్: టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ కామెంట్రీ చెబుతున్నాడనే విషయం తెలుసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రజ్ఞాన్ ఓజా కామెంట్రీ కూడా చెబుతున్నాడా? అంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు(శుక్రవారం) జరిగే తొలి టీ20 కోసం సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన హిట్‌మ్యాన్ ముందు వెటరన్ ఓఫెనర్ శిఖర్ ధావన్ ఉద్దేశించి ప్రజ్ఞాన్ ఓజా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. ఓజా కామెంటేటర్‌గా మారాడన్న సంగతి తనకు తెలియదన్న హిట్‌మ్యాన్.. మైదానం లోపల, వెలుపల ఆటగాళ్ల మధ్య స్నేహ బంధం జట్టుకు కచ్చితంగా మేలు చేస్తుందని తెలిపాడు.
వన్డే ప్రపంచకప్‌కు ధావన్..
ఇక ఇంగ్లండ్ పర్యటనలో శిఖర్ ధావన్ పెద్దగా ఆకట్టుకోపోయినా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సారథిగా బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే ప్రపంచకప్ జట్టులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని, అందుకే బహుశా అతడికి అవకాశాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. తనకు జోడీగా ధావన్ వంటి అనుభవజ్ఞుడు ఉంటే బాగుంటుందని రోహిత్ శర్మ కూడా కోరుకుంటున్నాడని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ మాదిరి రోహిత్- ధావన్ మధ్య కూడా ఫ్రెండ్‌షిప్ ఉందని పేర్కొన్న ఓజా.. ఇప్పటికే వీరిద్దరి జోడీ జట్టుకు ఎన్నో విజయాలు కూడా అందించిందని గుర్తు చేశాడు. అందుకే వన్డే వరల్డ్‌కప్-2023 భారత జట్టులో అతనికి చోటు ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

కామెంటేటరా?
ఈ వ్యాఖ్యలను రోహిత్ శర్మ ముందు ప్రస్తావించగా సరదాగా బదులిచ్చాడు.'అవునా...! ప్రజ్ఞాన్ ఓజా.. ఇప్పుడు కామెంటేటర్‌గా ఉన్నాడా? మంచిది. ఏదేమైనా.. మనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు ఎవరైనా సరే.. అది శిఖర్ లేదంటే మరొకరు.. ఎవరైనా.. పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తాం.
అదే సమయంలో స్నేహ బంధం పెంపొందుతుంది. మైదానం వెలుపల కూడా ఆ ఫ్రెండ్‌షిప్ కొనసాగుతుంది. నిజానికి ఆటగాళ్ల మధ్య ఇలాంటి బంధం ఉంటే డ్రెస్సింగ్‌రూమ్‌లో వాతావరణం బాగుంటుంది'' అని పేర్కొన్నాడు.

జట్టు అవసరమే ముఖ్యం..
జట్టు అవసరాలను బట్టి ప్లేయర్లకు అవకాశాలు ఇస్తారు తప్ప వారితో ఉన్న అనుబంధం కారణంగా కాదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఇక ప్రజ్ఞాన్ ఓజా, రోహిత్ శర్మ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు టీమిండియాతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు దక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్‌కు కలిసి ఆడారు. ఇక రోహిత్ గైర్హాజరీలో ధావన్ సారథ్యంలోని భారత జట్టు కరేబియన్ గడ్డపై విండీస్‌ను మట్టికరిపించి తొలిసారి 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications