
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో హ్యాట్రిక్ పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ముంబై ఇండియన్స్ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. గెలుపే లక్ష్యంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు సిద్దమైంది. ముందుగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న యువ హిట్టర్ ఇషాన్ కిషన్‌పై వేటు వేసింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ఈ యువ ఆటగాడిని పక్కనపెట్టింది. అతని స్థానంలో సౌరభ్ తివారీకి అవకాశం కల్పించింది. ఇక ఆడమ్ మిల్నే స్థానంలో నాథన్ కౌల్టర్ నైల్‌ను తీసుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని ముంబై ఆలోచిస్తుంది. అయితే ఇషాన్ కిషన్ పక్కనపెట్టడానికి గల కారణాన్ని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ వెల్లడించాడు.
టీమ్ ప్రణాళికల్లో భాగంగానే ఇషాన్‌ను పక్కనపెట్టామని, అంతకు మించిన కారణం ఏం లేదని పేర్కొన్నాడు. ఇక టాస్ గెలిచిన రోహిత్.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ పిచ్ బ్యాటింగ్ చేయడానికి అనువైనదని చెప్పాడు. ఇక తమ టీమ్ ఏ పరిస్థితుల్లో ఉందో తమకు బాగా తెలుసన్నాడు. తమ సామర్థ్యానికి తగిన ప్రదర్శన చేయలేదనేది కూడా వాస్తవేమనని, ఇది జట్టులోని ప్రతీ ఆటగాడికి అర్థమవుతుందన్నాడు. తాము కొన్ని తప్పిదాలు చేశామని అవి ఈ మ్యాచ్‌లో సరిదిద్దుకుంటామని చెప్పాడు. ఈ క్రమంలోనే తుది జట్టు విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ 11, 14, 9 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. ఈ పేలవ ప్రదర్శనతో అతను టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
మరోవైపు పంజాబ్ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో మన్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఓడిన టీమ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. దాంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
పంజాబ్ కింగ్స్:
రాహుల్ (కెప్టెన్), మన్‌దీప్ సింగ్, గేల్, మర్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్‌ప్రీత్ బ్రర్, నాథన్ ఎల్లిస్, షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
ముంబైఇండియన్స్:
రోహిత్ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, సౌరభ్ తివారి, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, నాథన్ కౌల్టర్‌నీల్, రాహుల్ చాహర్, బుమ్రా, బౌల్ట్