హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అభిమానులు, కామెంటేటర్లు ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుస్తారు. మైదానంలో కుదురుకుంటే రోహిత్‌ను ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. ముఖ్యంగా భారీ సిక్సర్లతో విరుచుకుపడుతాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను కొనియాడుతూ కామెంటేటర్లు హిట్ మ్యాన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు.
రోహిత్‌కు ఈ బిరుదు కూడా అలానే వచ్చిందని చాలా మంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. తనకు హిట్‌మ్యాన్ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని తాజాగా రోహిత్ శర్మ వెల్లడించాడు. అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోహిత్ శర్మ తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని వెల్లడించాడు. 'ఆస్ట్రేలియాతో 2013లో జరిగిన వన్డే సిరీస్‌లో నేను తొలి డబుల్ సెంచరీ సాధించాను. ఆ మ్యాచ్‌లో నేను 16 సిక్స్‌లు బాదాను. అది వరల్డ్ రికార్డు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో ఒకరు 'నువ్వు హిట్‌మ్యాన్'అని ప్రశంసించారు.
హోస్ట్‌గా ఉన్న రవిశాస్త్రి ఈ పదం విని.. ది హిట్‌మ్యాన్ అని గట్టిగా చెబుతూ ప్రపంచానికి పరిచయం చేశాడు. దాంతో హిట్‌మ్యాన్ అనేది నా నిక్‌నేమ్‌గా మారిపోయింది.'అని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు.
ఇక భారత్‌లో తనకు ఇష్టమైన మైదానాలు వాంఖడే, ఈడెన్ గార్డెన్స్ అని తెలిపిన హిట్ మ్యాన్.. విదేశాల్లో మాత్రం మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం(ఎంసీజీ) తన ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు. వచ్చే అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుందని, ఆ టోర్నీలో ఆడేందుకు తాను కూడా ఉత్సహంగా ఉన్నానని తెలిపాడు.
గత 10 ఏళ్లుగా భారత్ ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి దురదృష్టమే కారణమని రోహిత్ శర్మ తెలిపాడు. 'గత 10 ఏళ్లుగా మేం ఐసీసీ టైటిల్ గెలవలేదు. ఇది న్యాయమైన వాదనే. కానీ ఆటగాళ్ల వైఫల్యమే ఇందుకు కారణమంటే ఒప్పుకోను. మేం ప్రతీ టోర్నీలో అద్భుతంగా రాణించాం. కానీ మాకు అదృష్టం కలిసిరాలేదు.
ఇది ఓ సాకుగా ఉంటుంది. కానీ ఇదే వాస్తవం. ఐసీసీ టోర్నీలు కచ్చితంగా గెలవాల్సినవి. ప్రతీ ఏడాది మేం టైటిల్ గెలవడానికి ప్రయత్నిస్తున్నాం.'అని రోహిత్ తెలిపాడు.